ఏపీ సీఎం జగన్‌పై.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. “జగన్ ఒక జీరో.. అంతకు మించిన నీరో..“ అని వ్యాఖ్యానించారు. తన అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యాడని చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం సాధిం చాడని జగన్ మళ్లీ గెలుస్తారన్నారు. వైసీపీకి ఈసారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
నెత్తిన పెట్టుకున్న వైసీపీ కుంపటిని ఎప్పుడు దింపెయ్యాలా అని జనం చూస్తున్నారని ఆయన అన్నారు. ఏ రంగంలో అయినా `నాడు నేడు`పై చర్చకు టీడీపీ సిద్దమని ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. నియోజకవర్గాల్లో సమాంతర వ్యవస్థలు నడిపితే కుదరదని నాయకులను ఆయన హెచ్చరించారు. టీడీసీ నిరసనలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో జగన్ ఉలిక్కి పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌కు అర్థం అయ్యిందని బాబు వ్యాఖ్యానించారు.
ఈ వ్యతిరేకత, ఓటమిని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్‌ను మళ్లీ ఎందుకు గెలిపిస్తారన్నారు. పన్నులతో ప్రజలను బాదినందుకా, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసినందుకా అని ఆయన ప్రశ్నించారు. తన వైఫల్యాలతో పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులను బలి చేసినందుకా అని నిప్పులు చెరిగారు.
తమ్ముళ్లకు హెచ్చరిక..
ఇదే సమయంలో టీడీపీ నాయకులకు కూడా.. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఒక నియోజకవర్గ ఇంచార్జ్…ఇంకో నియోజకవర్గంలో వేలు పెట్టడానికి వీలులేదని ఆయన స్సష్టం చేశారు. నియోజకవర్గం లో ఇంచార్జ్‌కు వ్యతిరేకంగా గ్రూపులు కడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇంచార్జ్ కూడా అందరినీ కలుపుకుని పనిచెయ్యాల్సిందేనని ఆయన సూచించారు. ఈ మూడేళ్లు బయటకు రాని కొందరు నేతలు, ఇప్పుడు టీడీపీ గెలుపు ఖాయం అని తెలిసి యాక్టివ్ అవుతున్నారని పేర్కొన్నారు.