గుడివాడ అమర్‌నాథ్.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పరిశ్రమలు-ఐటీ మంత్రిగా నియమితుడైన నేత. ఇలా మంత్రి పదవి చేపట్టారో లేదో.. అలా ఆయన వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అదే పనిగా టార్గెట్ చేయడమే. వైసీపీలో చంద్రబాబును టార్గెట్ చేయడానికి కొందరు.. పవన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఇంకొందరు మంత్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టార్గెట్ చేయబోయే నేతకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే రంగంలోకి దించి నానా మాటలు అనిపించడం వైసీపీ స్టైల్.
గత మూడేళ్లూ పేర్ని నాని.. పవన్‌ను టార్గెట్ చేసేవారు. ఆయన మాజీ అయిపోగానే.. గుడివాడ అమర్‌నాథ్ ఆ బాధ్యత తీసుకున్నట్లున్నారు. పవన్ ఒక్కోసారి ఒక్కో పార్టీకి మద్దతివ్వడం గురించి విమర్శలు చేయడం గురించి విమర్శలు చేసిన ఆయన వార్తల్లో నిలిచారు. ఐతే గతంలో అమర్‌నాథ్ తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. తల్లి తెలుగుదేశం పార్టీలో ఉండటం.. అమర్‌నాథ్ టీడీపీలో పని చేయడం గురించి లేవనెత్తి ఆయన్ని గాలి తీశారు జనసైనికులు. అలాగే గతంలో పవన్ కళ్యాణ్‌తో అమర్‌నాథ్ దిగిన ఫొటోను బయట పెట్టారు.
దీని గురించి కౌంటర్ ఇవ్వబోయిన అమర్‌నాథ్ కామెడీ అయిపోయారు సోషల్ మీడియాలో. పవన్, తాను కలిసున్న ఫొటోను ప్రింట్ తీసుకుని మీడియా ముందుకొచ్చారు అమర్‌నాథ్. తన పక్కన పవన్ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడని.. అలాంటపుడు తాను ఆయనతో ఫొటో దిగినట్లా, తనతో ఆయన ఫొటో దిగినట్లా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల తనకు ఇమేజ్ వచ్చిందని, తాను 2 లక్షల మంది ఓటర్లున్న నియోజకవర్గానికి ప్రతినిధినని.. అలాంటపుడు తనను ఎంతోమంది కలుస్తారని, అభిమానంతో ఫొటోలు దిగుతారని, ఇది కూడా అలాంటిదే అని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
కానీ వాస్తవం ఏంటంటే.. ఈ ఫొటో తీసింది జనసేన ఆఫీస్‌లో. అమర్‌నాథ్ చూపించిన ఫొటోలో బ్యాగ్రౌండ్లో జనసేన పార్టీ సింబల్ కూడా కనిపిస్తోంది. ఆ ఫొటోలో వేరే వ్యక్తులు కూడా ఉండగా.. అమర్‌నాథ్ తాను, పవన్ ఉన్నంత వరకే కట్ చేసి తీసుకొచ్చారు.
పవన్ సాధారణంగా తన పక్కన ఎవరున్నారన్నది సంబంధం లేకుండా చేతులు కట్టుకుని ఫొటోలకు పోజులిస్తుంటారు. సాధారణ అభిమానుల ముందు కూడా చేతులు కట్టుకున్న అనేక ఫొటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తూ.. అమర్‌నాథ్ వ్యాఖ్యలను ఎండగడుతూ.. ఆయన గతంలో వేసిన రికార్డింగ్ డ్యాన్సులు, చేసిన చీప్ కామెంట్ల తాలూకు ఫొటోలు, స్క్రీన్ షాట్లు అన్నీ బయటికి తీసి ఆయన గాలి మరింతగా తీసేస్తున్నారు జనసైనికులు.