ఏపీలోకి ప్ర‌ముఖ సంస్థ‌.. 5500 కోట్ల పెట్టుబ‌డి

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ ఒక్క‌టంటే ఒక్క పెట్టుబ‌డి కూడా తీసుకురాలేక‌పోయార‌ని.. ఒక్క కంపెనీని కూడా స్థాపించ‌లేక పోయార‌ని విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు.. ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. తాజాగా భారీ పెట్టుబ‌డుల‌తో ఒక కీల‌క కంపెనీ.. ఏపీలోకి వ‌చ్చేందుకురెడీ అయింది. నాల్కో, మిధాని సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(యూడీఏఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్‌ అల్యుమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధ‌మైంది.

ఈ ప‌రిశ్ర‌మ ద్వారా రాష్ట్రంలో రూ. 5,500 కోట్ల పెట్టుబ‌డి రానుంది.  ఏడాదికి 60,000 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీ, రెండు నుంచి రెండున్నరేళ్ళలో ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామ‌ని.. నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్‌ కుమార్ ఝా తెలిపారు. ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం జగన్‌ను కలిసిన వీరు.. పెట్టుబ‌డి పెట్టేందుకు తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటు ద్వారా దాదాపు 750 – 1000 మందికి ప్రత్యక్షంగా.. మ‌రో రెండు వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు ల‌భించ‌నున్నాయ‌ని వారు వివ‌రించారు.

ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చిన అధికారులు, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి జ‌గ‌న్ సూచించారు. ఈ ప‌రిశ్ర‌మ‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి కృషి చేసిన‌ట్టు అధికారులు వివ‌రించారు.

మొత్తానికి ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుతో జ‌గ‌న్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు దాదాపు చెక్ పెట్టిన‌ట్టేన‌ని వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి దీనిపై టీడీపీ ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తుందో చూడాలి. వాస్త‌వానికి పార్టీల ర‌హితంగా చూసుకుంటే.. జ‌గ‌న్ అదికారం చేప‌ట్టిన త‌ర్వాత‌.. క‌రోనా ప్ర‌బ‌లింది. దీని కార‌ణంగా.. రెండు సంవ‌త్స‌రాల పాటు ప్ర‌పంచం.. అష్ట‌దిగ్బంధంలో చిక్కుకుపోయింది. వ‌చ్చేవారు వెళ్లే వారు సైతం లేక‌.. దేశాలు.. క‌రోనాపై యుద్ధాన్ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఏపీకి రెండేళ్ల పాటు ఏ ఒక్క పెట్టుబ‌డి కూడా రాలేదు. ఒక్క ఏపీ అనేకాదు.. దేశ‌వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ నూత‌న పెట్టుబడులు రాలేదు. ఇక‌, ఎట్ట‌కేల‌కు.. ఇప్పుడు ఒక ప‌రిశ్ర‌మ రావ‌డం.. జ‌గ‌న్ స‌ర్కారుకు కొంత ఊర‌ట‌నిచ్చే అంశ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.