మన టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు దాదాపుగా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎల‌క్ష‌న్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ‌లోని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాల‌కు విప‌క్షాలు సైతం ఇప్పుడే ఎన్నిక‌లున్నాయా అనే రీతిలో ప్ర‌తిస్పందిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ ఎపిసోడ్ కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

అదే టీఆర్ఎస్ త‌ర‌ఫున పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ కంటే ఎక్కువ‌గా ఆయ‌న త‌న‌యుడైన పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,  తెలంగాణ మంత్రి కె.తారక రామారావు తెర‌ముందుకు రావ‌డం. అయితే, దానికి త‌గిన‌ట్లే విప‌క్షాలు సైతం స్పందిస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని బీజేపీ నేత‌లు కేటీఆర్‌ను టార్గెట్ చేసేయ‌గా ఈ జాబితాలో ఏపీ నేత‌లు, బీజేపీ జాతీయ నేత‌లు చేరారు.

దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేస్తుందన్న భయంతోపాటు బీజేపీ బుల్డోజర్‌ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీపై హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. కేంద్రం విస్తృతంగా సహాయం చేస్తున్నప్పటికీ విమర్శిస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్‌ ఇటీవల బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని, దీనిని బట్టే బీజేపీ అంటే టీఆర్‌ఎస్‌కు ఉన్న భయమేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

జీవీఎల్ ఇలా ఘాటు వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు రియాక్ట‌య్యారు. బీజేపీ దృష్టిలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చిన్నపిల్లవాడని వ్యాఖ్యానించారు. చిత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తండ్రి పేరు చెప్పి కేటీఆర్‌ రాజకీయాలు చేస్తున్నార‌ని అన్నారు. కేటీఆర్‌ కేంద్రాన్ని విమర్శించే స్థాయి లేదని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. మొత్తంగా బీజేపీ నేత‌లకు ఇప్పుడు కేసీఆర్ కంటే కేటీఆర్ టార్గెట్ అయ్యార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.