అధికార పార్టీలో నేతల దృష్టిలో పాపాల భైరవుడు ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరే వినబడుతోంది. నెగిటివ్ గా ఎవరు టార్గెట్ చేయాలన్నా ముందుగా సజ్జలే టార్గెట్ అవుతున్నారు. మంత్రి పదవుల్లో తమ పేర్లు లేకుండా పోవటానికి సజ్జలే కారణమని కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉండటమే ఉదాహరణ. గతంలో పీఆర్సీ విషయంలో కూడా ఉద్యోగ సంఘాల నేతలు డైరెక్టుగా సజ్జలపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ప్రస్తుత విషయం చూస్తే హోంశాఖ మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరితకు రెన్యువల్ దొరకలేదు. మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి లాంటి వాళ్ళు మంత్రి పదవులను ఆశించారు. అయితే వాళ్ళకు అవకాశం దొరకలేదు. విచిత్రమేమిటంటే తమ ఎంఎల్ఏలకు మంత్రి పదవులు దక్కకపోవటానికి సజ్జలే కారణమని వాళ్ళ మద్దతుదారులు మండిపోతున్నారు.
మేకతోటి మద్దతుదారులైతే డైరెక్టుగా సజ్జలనే నిందిస్తున్నారు. ఇంతకీ ఒకరికి మంత్రి పదవి ఇప్పించటం, మరొకరిని తీయించేసేంత సీన్ సజ్జలకు ఉందా ? పార్టీ వర్గాల సమాచారం అయితే సజ్జలకు అంతటి సీన్ లేదు. సజ్జలకే కాదు ఎవరికీ జగన్మోహన్ రెడ్డిని ఒత్తిడి పెట్టేంత సీన్ పార్టీలో లేదట. జగన్ ఆలోచన ప్రకారం ఏవో కాంటినేషన్లు చూసుకుని వర్కవుట్ చేసుకున్నారు. తన లెక్కల్లో ఫిట్టయ్యేవారిలో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారంతే. ఉన్న మంత్రిపదవులే 25. పైగా పార్టీ నుండి గెలిచింది 151 మంది.
ఎవరిని తీసుకున్నా మిగిలిన 125 మందిలో అసంతృప్తి ఖాయం. మరలాంటపుడు ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కనపెట్టాలనే విషయంలో జగన్ కు ఒక క్లారిటీ ఉంటుంది. దాని ప్రకారమే మంత్రివర్గ కూర్పు జరిగిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అంతేకానీ జగన్ ఎవరికో మంత్రి పదవి ఇద్దామని అనుకున్నపుడు సజ్జల అడ్డుపడేంత సీన్ లేదంటున్నారు. లాభమో, నష్టమో మొత్తం తన లెక్కల ప్రకారమే జగన్ ముందుకెళతారని అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా సలహా అడిగితే సజ్జల ఇవ్వగలరే కానీ తనంతట తానుగా జగన్ కు సలహాలిచ్చేంత సీన్ సజ్జలకు లేదంటున్నారు. కానీ అందరి టార్గెట్ మాత్రం సజ్జలే అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates