మ‌ళ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌గ‌న్ జ‌పం ఇదేనా?

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కీల‌కమైన‌.. అత్యంత ముఖ్య‌మైన అంశాల్లో చాలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌కు చూపించిన రాజ‌న్న రాజ్యం.. ఇప్పు డు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌లేక పోతున్నార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు  చేస్తున్నారు. ఆయ‌న ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీల‌క అంశాల‌పై ప్లీజ్ .. ప్లీజ్.. అంటూ.. ప్ర‌ధాని మోడీని వేడుకున్నార‌ని.. వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ‌కు వ‌చ్చింది.

“మా నాయ‌కుడు ప్ర‌త్యేక హోదాను సాధిస్తారు.“ అని చెప్పిన వైసీపీ నేత‌లు.. ఇప్పుడు మాట మార్చారు. “మా నాయ‌కుడు ప్ర‌త్యేక హోదా అంశాన్ని వదిలి పెట్ట‌లేదు. కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారు“ అని చెబుతున్నారు. మంచిదే.. కానీ, దీనిపైనే నెటిజ‌న్లు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఇంకెన్ని రోజులు.. ఎన్ని నెల‌లు..ఎన్ని సంవ‌త్స‌రాలు.. ఇలా ప్లీజ్ ప్లీజ్ అంటూ.. వ్యాఖ్యానిస్తారు?  ఎన్నిసార్లు బ‌తిమ‌లాడ‌తారు.? అని ప్ర‌శ్నిస్తున్నారు. 22 మంది ఎంపీలు లోక్‌స‌భ‌లో ఉన్నారు. 6గురు.. రాజ్య‌స‌భ‌లో ఉన్నారు. వీరికి త్వ‌ర‌లోనే మ‌రో న‌లుగురు జ‌త కూడ‌తారు. అంటే.. మొత్తం 31 మంది(సాయిరెడ్డి స్థానం మారుతుంది) ఉంటారు.

మ‌రి ఇంత మందిని పెట్టుకుని కూడా ఇంకా ప్లీజ్ ప్లీజ్ అని అంటూనే ఉంటారా?  అని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. పొరుగున ఉన్న టీఆర్ ఎస్ కానీ, ప‌క్క‌న ఉన్న త‌మిళ‌నాడు కానీ, త‌మ ఎంపీల‌ను బ‌లంగా వాడుకుంటున్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో టీఆర్ ఎస్ ఎంపీలు.. నానా ర‌చ్చ చేస్తున్నారు. నీట్ ప‌రీక్ష విష‌యంలో త‌మిళ‌నాడు ఎంపీలు కేంద్రాన్ని నిల‌దీస్తున్నారు. మ‌రి వాటి బ‌లంతో పోల్చుకుంటే.. వైసీపీకి డ‌బుల్ ఉందిక‌దా! అంటున్నారు నెటిజ‌న్లు. అయిన‌ప్ప‌టికీ.. ఇంకా బ‌తిమ‌లాడుతూనే ఉంటారా? అని నిల‌దీస్తున్నారు.

ఇక‌, పోల‌వ‌రం విష‌యంలోనూ.. గ‌డువులు పెంచుతున్నారంటూ.. గ‌తంలో చంద్ర‌బాబు సర్కారుపై విరు చుకుప‌డిన జ‌గ‌న్.. ఇప్పుడు చేస్తోంది ఏంటి? అని నిల‌దీస్తున్నారు. ఆయ‌న మాత్రం గ‌డువులు పెంచ‌డం త‌ప్పుకాదా?  నాడు చెప్పిన సుద్దులు ఇప్పుడు ఏమ‌య్యాయి? అని నిల‌దీస్తున్నారు. వాస్త‌వానికి 2021లోనే పోల‌వ‌రం నుంచి నీటిని పారిస్తామ‌ని.. మాట‌లు పారించిన నాయ‌కులు.. ఇప్పుడు మ‌రోసారి దీనిని 2023 వ‌ర‌కు తీసుకువెళ్లార‌ని.. ఇదేనా.. రాజ‌న్న రాజ్యం! అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక‌, ఉత్త‌రాంధ్ర‌లో ప్రాజెక్టులు.. కేంద్ర సంస్థ‌లు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిలు.. సంస్థ‌ల విభ‌జ‌న ఇలా ఏవి చూసుకున్నా.. జ‌గ‌న్ స‌ర్కారు చేసింది ఏంటి? అని అంటున్నారు. మొత్తానికి ఈ నెటిజ‌న్లు.. చేస్తున్న కామెంట్లు… జ‌నంలో బాగానే చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం వైసీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.