జ‌గ‌న్ `బాదుడు` ఎఫెక్ట్‌.. ఏపీలో మ‌ళ్లీ అప్పు?

ఇప్ప‌టికే అప్పుల కుప్ప‌గా మారిన న‌వ్యాంధ్ర.. మ‌ళ్లీ మ‌ళ్లీ అప్పులు చేసుకునేందుకు ఉబ‌లాట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇచ్చ‌వాడుంటే.. ఎంతైనా తీసుకుంటాన‌ని.. బ‌హిరంగంగానే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో అప్పులకు సంబంధించి ఆచితూచి అనుమ‌తులు ఇవ్వాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఎడా పెడా అప్పులు చేసేందుకు అనుమ‌తులు ఇస్తోంది.  కొన్నాళ్ల కింద‌ట‌.. రైతులు వాడే విద్యుత్‌కు మీట‌ర్లు పెట్టినందుకు అప్పులు చేసుకునే వెసులు బాటు ఇచ్చింది.

త‌ర్వాత‌.. జ‌నాల‌పై చెత్త‌ప‌న్నులు వేసినందుకు.. మ‌రికొంత అప్పులు చేసుకునేందుకు కేంద్రంలో మోడీ స‌ర్కారు ప‌చ్చ‌జెండా ఊపింది. ఇవ‌న్నీ.. `సంస్క‌ర‌ణ‌లు`గా మోడీ చెపుతున్నారు. తమ సొంత పార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాలే వీటిని అమ‌లు చేయ‌డం లేదు. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం వీటిని తు.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తూ.. ప్ర‌జ‌ల గోళ్లు ఊడ‌కొడుతున్న నేప‌థ్యంలో మోడీ స‌ర్కారు.. ఎంత అప్ప‌యినా చేసుకోండి అంటూ.. ఊపిన ప‌చ్చ జెండాను కింద‌కు దించ‌డం లేదు.

తాజాగా.. మ‌రో 3716 కోట్ల రూపాయ‌ల అప్పున‌కు ఏపీకి మోడీ స‌ర్కారు అనుమ‌తించింది. దీనికి కార‌ణం.. తాజాగా.. విద్యుత్ చార్జీల‌ను పెంచి.. ప్ర‌జ‌లపై మోయ‌లేని భారాలు వేయ‌డ‌మే! న‌మ్మ‌క పోయినా.. ఇది నిజం. ఎందుకంటే.. కేంద్ర‌మే ఈ విష‌యం చెప్పింది. విద్యుత్తు సంస్కరణల అమలుతో డిస్కంల నష్టాలు తగ్గించి, విద్యుత్తురంగ ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేసినందుకు..(అంటే.. జ‌నాల‌ను పిండేసినందుకన్న‌మాట‌) కేంద్రప్రభుత్వం  రాష్ట్రానికి బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.3,716 కోట్ల అదనపు రుణానికి అనుమతి ఇచ్చింది.

విద్యుత్తు సంస్కరణల అమలుతో డిస్కంల నష్టాలు తగ్గించి, విద్యుత్తురంగ ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేసినందుకు.. కేంద్రప్రభుత్వం దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రోత్సాహం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.28,204 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.3,716 కోట్ల అదనపు రుణానికి అనుమతి లభించింది. తమిళనాడు (రూ.7,054 కోట్లు), ఉత్తర్‌ప్రదేశ్‌ (రూ.6,823 కోట్లు), రాజస్థాన్‌ (రూ.5,186 కోట్లు) తర్వాత అత్యధిక అదనపు రుణ సౌకర్యం ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది.  

ఆంధ్రప్రదేశ్‌కు 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.46,443 కోట్ల బహిరంగ రుణానికి అనుమతించ గా, అందులో పెట్టుబడి వ్యయంతో ముడిపెట్టినది రూ.5,309 కోట్లు,.. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసినందుకు రూ.3,716 కోట్లు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. మిగిలిన రూ.37,418 కోట్లు నేరుగా బహిరంగ మార్కెట్‌ రుణాలుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇదీ.. సంగతి!!  అంటే.. ప్ర‌జ‌ల‌ను ఎంత పిండేస్తే.. ఎంత పీడిస్తే.. అంత‌గా అప్పులు చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తున్నార‌న్న‌మాట‌.