టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు రాసిన ‘‘నేను.. తెలుగుదేశం’’ పుస్తకాన్ని పార్టీ అధినేత చంద్రబాబు, హరియాణ గవర్నర్ దత్తాత్రేయలు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, చంద్రబాబు మాట్లాడుతూ.. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల ప్రయోజనాల కోసం తాను పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. ‘‘ నష్టపోయిన ఏపీని పునర్నిర్మించేది టీడీపీనే. ఎన్టీఆర్ శత జయంతి, మహానాడును వైభవంగా నిర్వహిస్తాం. ప్రాంతీయ పార్టీతో దేశ రాజకీయాలను వాదించింది ఎన్టీఆరే.. అధికారమే శాశ్వతం అనుకుంటే ఓడిపోయేవాడిని కాదు“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. హైటెక్ సిటీపై రాజశేఖర్‌రెడ్డి కూడా విమర్శలు చేశారని చెప్పారు. ప్రస్తుతం ఏపీకి రాజధాని లేకపోవడం.. అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రానున్న కాలంలో రాష్ట్రం విషయంలో తాను గురుతర బాధ్యతగా వ్యహరించాల్సిఉందన్నారు. ఎన్టీఆర్ కార్యక్రమాలను రూపకల్పన చేసిన వ్యక్తి కంభంపాటి రామ్మోహనరావే అని చంద్రబాబు కొనియాడారు. మాజీ సీఎం ఎన్టీఆర్ గొప్ప మనసున్న మనిషి అని గవర్నర్ దత్తాత్రేయ కొనియాడారు. ప్రజాస్వామ్య, నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని సూచించారు. సేవాభావంతో ఉన్నవాళ్లే రాజకీయాల్లో రాణిస్తారని తెలిపారు. అవినీతిని ఎన్టీఆర్ చీల్చిచెండాడారని దత్తాత్రేయ గుర్తుచేశారు.
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్ వల్లే 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యా. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు యువతికి ఇవ్వాలి. అనేక మందికి ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు. మూడు ముక్కల్లో మ్యానిఫెస్టో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆశయాలను యువతరానికి తెలియజేయాలి’’ అని అయ్యన్నపాత్రుడు సూచించారు.
40 ఏళ్లుగా టీడీపీలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. రెండేళ్లు కష్టపడి పుస్తకాన్ని రచించానని తెలిపారు. భావితరాలకు తన పుస్తకం ఉపయోగనపడాలని ఆకాంక్షించారు. రానున్న మహానాడు ద్వారా యువతరాన్ని.. పార్టీ వైపు తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నానన్నారు.
మాజీ డీజీపీ దొర మాట్లాడుతూ.. 40 ఏళ్లలో టీడీపీ అనేక ఆటుపోట్లు చూసిందని పేర్కొన్నారు. “పాలనలో ఎన్టీఆర్, చంద్రబాబుది ఒక్కోశైలి. ఎన్టీఆర్ తీసుకున్న ఏ నిర్ణయమైనా అప్పట్లో సంచలనమే. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశాను. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లే సమయంలో ఎన్టీఆర్ క్రేజ్ చూసి అప్పటి కేంద్ర ప్రభుత్వం షాకైంది’’ అని హెచ్‌జే దొర వెల్లడించారు.