పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులతో పని ఏమీ లేదు అనుకుంటున్నారేమో! రెండు పార్టీలూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు కొనసాగిస్తున్న పనులకు పూర్తిగా వ్యత్యాసం ఉందని సాంకేతిక నిపుణులు సైతం అంటున్నారు. మొదట్లో ప్రాజెక్టు పనులకు పెద్ద శ్రద్ధ చూపని వైసీపీ తరువాత తన పంథా మార్చుకుని కేంద్రం దగ్గర నిధులు తెచ్చుకుని పనులు చేపట్టినా అవేవీ నాణ్యతాపూర్వకంగా జరగడం లేదని తేల్చేసింది టీడీపీ. తాము చేపట్టిన విధంగా పనులు అన్నింటినీ కొనసాగించి ఉంటే ప్రాజెక్టు పూర్తికి మార్గం సుగమం అయి ఉండేదని కూడా అన్నారు చంద్రబాబు ఓ సందర్భంలో ! ఇప్పుడు పునరావాసం పై కానీ నిర్మాణం పై కానీ కేంద్రం వెచ్చించే నిధులకు కోత ఉండడంతో సమస్య అపరిష్కృతంగానే ఉండనుంది.
పాత లెక్కలు కొత్తగా తెరపైకి తెచ్చి పెరిగిన నిర్మాణ వ్యయం భరించేందుకు కేంద్రం సుముఖంగా లేదని తేలిపోవడంతో వివాదాలు నెత్తినెక్కి కూర్చొంటున్నాయి. అందుకే ప్రాజెక్టు పనుల్లో కదలిక ఉన్నా కూడా పూర్తి చేయాలన్న సంకల్పం అయితే లేదని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వీటిపై వైసీపీ సర్కారు చెబుతున్న మాటలు కూడా ఏమంత నమ్మశక్యంగా లేవని తేల్చేస్తున్నాయి. ఈ దశలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వాదోపవాదాలు నడుస్తున్నాయి. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లిస్తామని యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు.
తాను ప్రాజెక్టు పూర్తికి పూర్తిగా కంకణబద్దుడై ఉన్నానని కూడా అంటున్నారు.నాన్న వైఎస్సార్ ఆశయం నెరవేర్చేందుకు తాను కృషి చేస్తానని కూడా చెబుతున్నారు.ఇవన్నీ బాగానే ఉన్నా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం చెబుతున్న మాటలకూ, రాష్ట్రం చెబుతున్న మాటలకూ అస్సలు పొంతనే లేకుండా పోతోంది. తాము ఇస్తామంటున్నది కేంద్రం కోరుకుంటున్నది వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం దగ్గర నిధులు పాత లెక్కల ప్రకారమే విడుదలవుతాయని తేలిపోయింది. దీనినే ఇప్పుడు చంద్రబాబు తప్పు బడుతున్నారు. ప్రాజెక్టుకు అవసరం అయిన నిధులలో భాగంగా 15 వేల 600 కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం అంటోందని కానీ ప్రాజెక్టు పూర్తికి మరో 40 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, వాటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నిస్తోంది.
ఇంకా చంద్రబాబు ఏమంటున్నారంటే .. ప్రాజెక్టు పనుల్లో భాగంగా కాఫర్ డ్యామ్ పూర్తయి ఉంటే ఎంత వరదలు వచ్చినా డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయేది కాదని, ఇందుకు ప్రస్తుత ప్రభుత్వ విధానమే కారణమని, వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం అయిందని అన్నారు.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం, పునరావసం సంబంధిత నిధులు అన్నీ తామే భావిస్తామని గతంలో నితిన్ గడ్కరీ చెప్పారని కానీ వైసీపీ సర్కారు తీరు కారణంగా ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తారు.