వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని.. టీడీపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నా యి. 2019 ఎన్నికల ఫలితంతో తలబొప్పికట్టిన నేపథ్యంలో చంద్రబాబుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలనే వ్యూహం అత్యంత కీలకంగా మారింది. అటువైపు.. జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా .. చూడాలనే వ్యూహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు.. చంద్రబాబు కానీ, పవన్ కానీ.. ఈ విషయంలో ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోయి నా.. పొత్తుల దిశగానే రెండు పార్టీలూ అడుగులు వేస్తుండడం గమనార్హం. దీనిపై మరో రెండు మాసాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే.. పొత్తులకు సంబందించి టీడీపీలో ఒక వాదన తెరమీదకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు బలం ఎంత ఉంది? ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే మూడు విషయాలను పరిశీలిస్తే.. కేవలం రెండు జిల్లాల్లోనే జనసేన టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
గత ఏడాది జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఈ రెండు పార్టీల నాయకులు అనధికార పొత్తు పెట్టుకుని గెలుపు గుర్రం ఎక్కారు. అంతేకాదు.. ఈ జిల్లాల్లోనే.. జనసేన కు బలం, బలగం కూడా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో బలం అంతో ఇంతో ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన సామర్థ్యం చూపించే స్థాయి ఈ రెండు జిల్లాల్లోనే ఉందని.. జనసేన నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనేటీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఈ రెండు జిల్లాలను తమకు వదిలేసి.. మిగిలిన రాష్ట్రం మొత్తం. టీడీపీ పోటీ చేసిననా తమకు అభ్యంతరం లేదనే వాదన వినిపిస్తోంది.
అంటే.. జనసేన తన సత్తాను చాటేందుకు ఉభయ గోదావరి జిల్లాలను ప్రామాణికంగా తీసుకుంటే.. ఈ రెండు జల్లాల్లోని మొత్తం 31 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలను(కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం) తమకు వదిలేయాలనే డిమాండ్ తెరమీదికి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక, మిగిలిన రాష్ట్రం మొత్తం టీడీపీ పోటీ చేస్తే.. తాము మద్దతిస్తామనే డిమాండ్‌ను తెరమీదికి తేవాలని.. క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు అంటున్నారు. మరి ఇదే జరిగితే.. రేపు ఈ విషయంపైనే జనసేన పట్టుబడితే… టీడీపీ ఏం చేయాలనే విషయంపై తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.