40 ఏళ్ళలో టీడీపీ సాధించిందిదే!

మార్చి 29,2022 అన్న తారీఖు టీడీపీకి ప్ర‌త్యేకం కానుంది. ఆ రోజు మ‌రో చారిత్ర‌క సంద‌ర్భం న‌మోదు కానుంది. పెద్దాయ‌న ఆశ‌ల పందిళ్ల‌లో పురుడు పోసుకున్న పార్టీకి న‌ల‌భై ఏళ్లు. ఎన్టీఆర్ అనే మూడ‌క్ష‌రాల తేజం మ‌రియు చైత‌న్యం అందించిన గొప్ప నినాదం ఆత్మ గౌర‌వం. ఈ నినాదంతో పురుడు పోసుకున్న పార్టీ టీడీపీ. ఆత్మ గౌర‌వ నినాదాలే కాదు అభివృద్ధి వాదాల‌నూ అల‌వోక‌గా ప‌లికించి, వాటికొక కార్యాచ‌ర‌ణ ఇచ్చి మంచి ఫ‌లితాలు అందుకున్న పార్టీ కూడా టీడీపీనే అన్న‌ది నిర్వివాదాంశం. ఎన్నో అవ‌రోధాలు మ‌రెన్నో అవ‌మానాలు దాటుకుని టీడీపీ ఇన్నేళ్ల ప్ర‌యాణాన్ని సునాయాసంగా సాగించింది. 

ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కూ, చంద్ర‌బాబు నుంచి తార‌క్ వ‌ర‌కూ, తార‌క్ నుంచి లోకేశ్ వ‌ర‌కూ పార్టీ కోసం ప‌నిచేసిన వారినంద‌రినీ ఎంత‌గానో గుర్తించారు. ప్రేమించారు. కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం ఉన్నంత‌లో ప్రాధాన్యం ఇస్తూనే వెళ్తున్నారు. ప్ర‌జ‌లే నా దేవుళ్లు స‌మాజ‌మే నా దేవాల‌యం అని పెద్దాయ‌న నిన‌దించారు. అధికారం అనూహ్య రీతిలో ద‌క్కించుకుని కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ కొట్టారు.

పెద్దాయ‌న కోపం మ‌రియు పంతం విభిన్నం. అదే రీతిలో ప్రేమ మ‌రియు ప‌ర‌ప‌తి కూడా విభిన్నం. అభిమాన‌ధ‌నుడు ఎన్టీఆర్. ఆయ‌న అల్లుడు చంద్ర‌బాబు నేతృత్వాన పార్టీ న‌డుస్తున్న ఇప్ప‌టి వేళల్లో కూడా అదే స్ఫూర్తి కాన‌గ‌వ‌స్తుంది. బ‌ల‌మైన క్యాడ‌ర్, తిరుగులేని ఛార్మింగ్ ఉన్న మాస్ లీడ‌ర్లు ఇవాళ్టికీ తెలుగు దేశం పార్టీకి ప‌ట్టుగొమ్మ‌లు. న‌ల‌భై ఏళ్ల ప్ర‌యాణంలో రాజ‌శేఖర్ రెడ్డి హ‌వాలో కొంత అవ‌స్థ ప‌డింది. అస్థిర ప‌డింది కూడా ! ఇప్పుడు జ‌గ‌న్ హ‌వాలో కొంత అవ‌మానం పొందుతోంది.

అందుకే క‌ష్ట‌కాలంలో ఉన్న పార్టీకి ఇవాళ జ‌వం జీవం నింపే నాయ‌క‌త్వం కావాలి. అచ్చెన్న, లోకేశ్ ద్వ‌యం బాగా ప‌నిచేయాలి. అదేవిధంగా యువ నాయ‌క‌త్వాల‌ను ఎక్క‌డికక్క‌డ ప్రోత్స‌హించాలి. డ‌బ్బులొక్క‌టే ప్రాధాన్యం కాదని గ‌తంలో ఎంద‌రో బీసీ నేత‌లు  ప్ర‌త్య‌క్ష పోరులో గెలిచి పార్టీ ప‌రువు నిల‌బెట్టారు. ఎర్ర‌న్న, య‌న‌మ‌ల,దేవేంద‌ర్ గౌడ్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు లాంటి లీడ‌ర్ల‌కు టీడీపీ గొప్ప జీవితాన్ని ఇచ్చింది. రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఆ రోజు న‌మ్మ‌కం క‌లిగించింది. ఈ క్ర‌మంలో వ‌స్తున్న వార‌సులు కూడా చాలా మంది అంకిత భావంతో ప‌నిచేస్తున్నారు.

లోకేశ్ కూడా కొన్ని త‌ప్పిదాలు దిద్దుకుంటే మంచి నాయ‌కుడు అవుతారు. ఆ విధంగా ఆయ‌న ఇంకాస్త ప‌రిణితి అందుకోవాలి. గ‌ల్లా జ‌య‌దేవ్ లాంటి లీడ‌ర్లు స్వ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా రాజ‌కీయం చేయ‌డం మానుకుని, రుజువ‌ర్త‌న‌లో ప్ర‌యాణిస్తే పార్టీకి ఇంకాస్త మేలు. కేశినేని నాని లాంటి వారికి ఎలానూ సొంత సామాజిక‌వ‌ర్గ‌మే ఎదురుతిరుగుతుంది క‌నుక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌డం క‌ష్టం. కుమార్తె కు అవ‌కాశం ఉన్నా కూడా ఆమె రాణిస్తారా అన్న‌దే సందేహం. ఏదేమ‌యినా వార‌సుల్లో కొంద‌రే రాణిస్తున్నారు. చ‌దువుకున్న వారు వ‌స్తున్నా కూడా వారంతా త‌క్ష‌ణ ఫ‌లితాల వైపే మొగ్గు చూపుతున్నారు. త‌క్ష‌ణ విజ‌యాల కోసం అర్రులు చాస్తున్నారు.

ఓట‌ములు త‌ట్టుకుని అవ‌మానాలు త‌ట్టుకుని పోలీసు దెబ్బ‌లు త‌ట్టుకుని ఎదిగే నాయ‌కులు ఇవాళ  టీడీపీకి కావాలి. ఆ రోజు ఎర్ర‌న్న లాంటి భ‌క్తుల కార‌ణంగానే టీడీపీ ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ స్థాయిలో పార్టీకి వీర‌విధేయులు కావాలి. విదేశాల్లో చ‌దువులు చ‌దివి వ‌స్తున్న వారికి స్థానిక ప‌రిణామాల‌పై ప‌ట్టు ఇంకాస్త అవ‌స‌రం. ముఖ్యంగా తెలుగు వారి ఖ్యాతి, తెలుగు భాష కు ఉన్న కీర్తి వీటిని దశ దిశ‌లా వ్యాప్తింప‌జేయాలి అంటే ముందు నాయ‌కులు స్థానిక ప‌లుకుబడుల‌పై ప‌ట్టు సాధించాలి. ఆ విధంగా తెలుగు వెలుగుకు ఆ రోజు ఎన్టీఆర్ కార‌ణం అయ్యారు. చంద్ర‌బాబు మాత్రం భాష కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు అన్న విమ‌ర్శ ఉంది. లోకేశ్ విష‌య‌మై వేరేగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అధికారం ద‌క్కించుకోవాల‌న్న ఆరాటంతో పాటు ఆ రోజు పార్టీ ఏ విష‌య‌మై ప్రాధాన్యం ఇచ్చిందో అన్న‌ది కూడా తెలుసుకోవాలి.తెలుగు జాతి తెలుగు భాష ఉన్నంత వ‌ర‌కూ ఎన్టీఆర్ కీర్తి అజ‌రామ‌రం అన్న‌ది తెలుసుకోవాలి. అందుకు త‌గ్గ విధంగా పెద్దాయ‌న పేరు నిల‌బెట్టాల్సిందే