మా విధానంలో మార్చుకునేది లేదు.. టీఆర్ఎస్‌కు కేంద్ర మంత్రి కౌంటర్!

తెలంగాణ‌, కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఏర్ప‌డిన  ధాన్యం వివాదం.. ఆస‌క్తిగా మారుతోంది. త‌మ విధానం మార్చుకునేది లేద‌ని.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. మీరు ఎలాగూ.. కేంద్రంలో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్నారు క‌దా.. అప్పుడు మీరే విధానం మార్చుకోండి! అంటూ.. స‌టైర్లు పేల్చింది. ఈ వివాదానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కార్యాల‌యం వేదిక‌గా మార‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై జరిగిన భేటీలో పీయూష్ గోయల్, మంత్రి ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కేంద్రం ధాన్యం సేకరణ చేయదని మంత్రులకు గోయల్‌ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా… మీరు ఢిల్లీలో ఎలాగో సత్తా(అధికారం)లోకి వస్తారు కదా… అప్పుడు మార్చండంటూ పీయూష్‌ స్పందించారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తామని ప్రశాంత్ రెడ్డి బదులిచ్చారు. బీజేపీ కూడా ఇద్దరితో మొదలై.. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చిందని ప్ర‌శాంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భేటీకి పిలిచిన గోయల్.. 15 నిముషాల పాటు సమావేశాన్ని నిలిపివేశారు. కిషన్‌ రెడ్డి రాకపోవటంతో భేటీ కొనసాగించారు. బయట దుకాణంలో ఏది అమ్ముడు పోతుందో అదే కొంటామని కేంద్ర మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను కేంద్రమంత్రికి ప్రశాంత్ రెడ్డి చూపించారు. పంజాబ్ లో సేకరించిన విధంగా తెలంగాణలో ఎందుకు సేకరణ చేయరని ప్రశ్నించారు.

తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేయమని.. బియ్యం మాత్రమే తీసుకుంటామని పీయూష్‌ గోయల్‌ తేల్చి చెప్పారు. అనంత‌రం.. కేంద్ర మంత్రి పీయూష్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లే చేయ‌డం గ‌మ‌నార్హం. అవినీతి స‌ర్కారు అంటూ.. ఆయ‌న వ్యాఖ్య‌లు గుప్పించారు. మొత్తంగా .. తెలంగాణ లో టీఆర్ ఎస్ వ్యూహం ఫ‌లించ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.