మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత పురాతన లిఖిత రాజ్యంగం 1788లో అమెరికాది. మన దేశంలో రాజ్యాంగం 72 ఏళ్ల కింద 1950లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం తమను కాపాడుతుందన్న భరోసాలో ప్రతీ ఒక్కరు ఉంటారు. మన లక్ష్యం ఎంత గొప్పదో.. మార్గం కూడా అంత గొప్పగా ఉండాలని గాంధీ చెప్పారు. ఎవరి పరిధి ఏంటీ? ఎవరి విధులేంటీ? అన్న దానిపై స్పష్టత రావాలి. ఈ స్పష్ట రాకుంటే వ్యవస్థలో గందరగోళం వచ్చే అవకాశం ఉంది’ అని తెలిపారు.
“ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులను పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాత సభానాయకుడికి లేఖ రాశా. న్యాయనిపుణులతో కూడా ఈ విషయంపై చర్చించా. కోర్టులంటే అందరికి గౌరవం ఉంది. అయితే దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నా.“ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
“ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దు. రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చకుండా అడ్డుపడొద్దు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలి. ఒకప్పుడు దేశంలో రాజరిక వ్యవస్థ ఉండేది. అధికారం రాజు చేతుల్లోనే ఉండేది. రాచరికం నుంచి తర్వాతి రోజుల్లో ప్రజాస్వామ్యం వచ్చింది. సభలో చర్చించేందుకు అనుమతినిచ్చినందుకు ధన్యవాదాలు.“
“రాజ్యాంగం రావడానికి వెనక ఎంతో మంది గొప్ప వాళ్ల కృషి ఉంది. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులతో పాలన చేయాలని రాజ్యాంగం చెప్పింది. ప్రజాభిప్రాయం కేవలం శాసన వ్యవస్థలోనే ప్రభావితం అవుతుంది. ప్రజల చేత, ప్రజల కొరకు అని రాజ్యాంగంలో రాసుకుంది శాసన వ్యవస్థ గురించే. శాసనసభ, లోక్‌సభ.. ఈ రెండు వ్యవస్థలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు, కాలేరు.“ అని ధర్మాన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates