అటు వైపు చూస్తే అధికార పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు. అందులో మెజారిటీ సభ్యులు సభలో ఉంటారు. ఇటు చూస్తే తెలుగు దేశం పార్టీ తరఫున 20 మంది కూడా ఉండరు అసెంబ్లీలో. దీంతో మూడేళ్లుగా వైకాపా అసెంబ్లీలో తిరుగులేని ఆధిపత్యం సాగిస్తోంది. స్పీకర్ పూర్తిగా అధికార పక్షం వహిస్తూ ప్రతిపక్షానికి పెద్దగా అవకాశం లేకుండా చేస్తుండటంతో టీడీపీ వాయిసే పెద్దగా వినిపించట్లేదు సభలో.
కీలకమైన విషయాలపై మాట్లాడుతున్నపుడు, అధికార పార్టీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నపుడు మధ్యలోనే మైక్ కట్ అయిపోతోంది. చాలా సందర్భాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బేలగా కనిపించారు సభలో. ఐతే ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో దూకుడు, ఆత్మవిశ్వాసం పెరిగింది. అధికార పార్టీ బయటే కాదు.. అసెంబ్లీలోనూ ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో తెలుగుదేశం సభ్యులు ఒక మాస్టర్ స్ట్రోక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు.
సీఎం జగన్‌ను వైకాపా ఎమ్మెల్యేలు మరీ టూమచ్ అనిపించే రీతిలో అసెంబ్లీలో పొగడటం.. జగన్ ముసిముసి నవ్వులు నవ్వడం.. మూడేళ్లుగా చూస్తున్న తంతే. జగన్‌ను మెప్పించడానికి ఎవరి స్థాయిలో పోటీ పడుతుండటంతో చూసే వారికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా తమ ప్రయోజనాలు తమవి అన్నట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ కీర్తనల్లో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని.. బుధవారం సభలో జగన్‌ను పొగిడే పనిలో పడింది. గతంలోనూ ఆమె జగన్‌ను పలుమార్లు ఆకాశానికెత్తేసింది. తాజాగా మరోసారి ఆమె పొగడ్తల దండకం తీసింది.
ఐతే ఆమె ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు సభలో చిడతలు అందుకుని.. మోగించడం మొదలుపెట్టారు. కాసేపటికి వాటి మోత మోగిపోయింది. దీంతో రజిని చాలా ఇబ్బంది పడుతూ ప్రసంగం ఆపేసింది. స్పీకర్ తీవ్ర ఆగ్రహంతో టీడీపీ ఎమ్మెల్యేల నుంచి చిడతలు తీసుకోవాలని మార్షల్స్‌ను ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది జనాల దృష్టిని కూడా బాగా ఆకర్షించింది. జగన్‌ను శ్రుతి మించి పొగిడే వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులను ఒక్క మాట మాట్లాడకుండా వారు సిగ్గుపడేలా ఈ చిడతల ఐడియాను భలే ఉపయోగించారంటూ టీడీపీ నేతలపై ప్రశంసలు కురుస్తున్నాయి.