వైసీపీలో కొత్త కుంప‌టి.. సెగ‌లు రేపుతున్న జ‌గ‌న్ నిర్ణ‌యం

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వులు కోల్పోయిన వారిని సంతృప్తి పరిచేందుకు సీఎం జ‌గ‌న్ వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రూ ప‌ద‌వులు పోయాయ‌ని బాధ‌ప డొద్దు.. అంద‌రికీ న్యాయం చేస్తాను. అయితే.. పమంత్రి వ‌ర్గంలో కాక‌పోతే.. జిల్లాల‌కు ఇంచార్జ్‌లుగా నియ‌మిస్తాను.. అని హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కొత్త కుంప‌టికి దారితీసింది. ఎందుకంటే.. ఇప్ప‌టికే.. స‌ద‌రు మంత్రుల‌తో చాలా మంది నేత‌ల‌కు ప‌డ‌డం లేదు. మంత్రులే పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. త‌మ‌కు క‌నీసం కూడా విలువ ఇవ్వ‌డం లేద‌ని.. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కేడ‌ర్ కూడా తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

అందుకే.. దాదాపు ఏడాదిన్న‌ర కాలంలో మంత్రుల‌తో కీల‌క నేత‌లు అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా నియోజ‌క వర్గాల్లో నేత‌ల మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయి.. పార్టీ ఇబ్బంది ప‌డుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వారు ఎప్పుడు మంత్రులుగా దిగిపోతారా? అని ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూసిన ప‌రిస్థితి ఉంది. తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాల‌లో కొంద‌రు మంత్రుల‌కు వ్య‌తిరేకంగా.. సొంత పార్టీలోనే కూట‌ములు తెర‌మీదికి వ‌చ్చాయి. బ‌హిరంగ విమ‌ర్శ‌లు కూడా చేసుకున్నారు. కులాల పేరుతోనూ రాజ‌కీయాలు చేశారు.

అంతేకాదు.. బ‌ల‌మైన నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు డ‌మ్మీలు అయిపోతే.. మంత్రులు బలంగా ఉన్న చోట‌.. నాయ కులు డ‌మ్మీలు అయ్యారు. దీంతో ప్ర‌తి విష‌యంలోనూ.. నేత‌ల‌కు, మంత్రుల‌కు కీచులాట‌లు ష‌రామామూలే అన్న‌ట్టుగా మారి పోయాయి. ఫ‌లితంగా.. ఈ మంత్రుల‌ను సాగ‌నంపాల్సిందే.. అన్న‌ట్టుగా నాయ‌కులు ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. వారి ప‌ద‌వులు ఎప్పుడు ఊడిపోతాయా? అని కూడా ఎదురు చూశారు. ఇక‌, స‌మ‌యం రానేవ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డుతున్న స‌మ‌యం లో.. సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారిగా షాక్ ఇచ్చారు. ఈ తీసేసే మంత్రుల‌ను  జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను చేస్తాన‌ని.. వారికిగౌర‌వం, హోదా ఏమాత్రం త‌గ్గ‌ద‌ని చెప్పుకొచ్చారు.

అంటే.. మంత్రులుగా ఉండి.. వివాదాల‌కు కేంద్రాలుగా మారిన వారు.. ఆయా ప‌ద‌వులు కోల్పోయినా.. ఇప్పుడు అదే జిల్లాల‌కు ఇంచార్జ్‌లు అవుతారు. అంటే.. మ‌రింత‌గా వారికి నేత‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డంంతోపాటు.. వివాదాలు మ‌రింత తార‌స్థాయికి చేర‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.,. సీనియ‌ర్లు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ సంతృప్తి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేద‌ని.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. జిల్లాల్లోనూ ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నించి.. ముందుకు సాగితే చాలని.. లేక‌పోతే.. వ్య‌క్తుల‌ను సంతృప్తి చేయాల‌నే ఉద్దేశంతో ముందుకు సాగితే.. పార్టీనే తీవ్ర అసంతృప్తిలో మునిగిపోతుంద‌ని అంటున్నారు.