కాపుల రిజర్వేషన్ అంశంపై ఇప్పటి వరకు దోబూచులాడుతోందని బావించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈవిషయంపై అసలు విషయం వెల్లడించింది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాపు రిజర్వేషన్ బిల్లు అంశంపై.. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పింది. దీని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఓబీసీ రేజర్వేషన్ల అంశం స్టేట్ లిస్ట్ కు సంబంధించింది కనుక, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని స్పష్టం చేసింది.
కాపు(విద్యాసంస్థల్లో సీట్ల రిజర్వేషన్లు మరియు రాష్ట్ర పరిధిలోని సేవల్లో నియామకాలు లేదా పోస్టులు) బిల్లు, 2017 రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అప్పటి చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం నుండి పంపారని తెలిపింది. ఇది సాధారణ ప్రక్రియగా వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు కూడా పంపించారు. దీనిపై ఆయా శాఖలు విభాగాలు తమ అభిప్రాయం చెప్పాయని కేంద్రం స్పష్టం చేసింది.
రాష్ట్ర OBC జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ, 04.04.2019న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన కాపు OBC బిల్లు, 2017ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. అంటే.. ఓబీసీలో కాపులకు రిజర్వేషన్‌లు ఇచ్చేయవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి ఉదాహరణగా.. మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లును కేంద్రం ఉదహరించింది.
రాష్ట్రంలో 50 శాతానికి మించిన మరాఠా OBC రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మరింత స్పష్టం చేసింది. అంటే.. కాపు బిల్లు విషయంలో రాష్ట్రం తన ఇష్టపూర్వకంగా ముందడుగు వేయొచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, కాపు ఒబిసి రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానాలపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కాపు సామాజికవర్గాన్ని తప్పుదోవ పట్టించాయన్నారు. కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు.
పార్లమెంటులో కేంద్ర ప్రభత్వం తన ప్రశ్నలకు సమాధానమిస్తూ స్పష్టత ఇచ్చిన సందర్భంగా, గతంలో కేంద్రానికి అనవసరంగా పంపిన కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు, 2017ను కేంద్రం నుంచి వెంటనే ఉపసంహరించుకుని, కాపులకు బీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలని, కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.
Tags Andhra Pradesh Chandrababu Naidu Feature YS Jagan YSRCP