లోక్ సభలో ఏపీ కల్తీ మద్యంపై రచ్చ

ఏపీలో నాటు సారా, కల్తీ మద్యం బ్రాండ్ల వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. జంగారెడ్డి గూడెం మృతుల అంశంపై అసెంబ్లీ గత వారం రోజులుగా అట్టుడుకుతోంది. తాజాగా ఈ వ్యవహారం లోక్ సభలోనూ అగ్గి రాజేసింది. ఏపీలో మ‌ద్యం నాణ్య‌తపై ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లోక్ సభలో ప్రస్తావించారు. అలా లేఖ రాసినందుకు త‌న‌పై వైసీపీ ప్రభుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని రఘురామ సభలో ఆరోపించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ఓ ప్ర‌జా ప్ర‌తినిధిగా, పార్ల‌మెంటు స‌భ్యుడిగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌తోనే తాను ప్ర‌ధానికి లేఖ రాశాన‌ని రఘురామ అన్నారు. ప్రధానికి లేఖ  రాశాన‌న్న కార‌ణంతో త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టేందుకు, ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్రయ‌త్నిస్తోంద‌ని ర‌ఘురామ‌ లోక్ స‌భ‌లో ఆరోపించారు. ఏపీలో అమ్మే చీప్ లిక్కర్‌లో విష పదార్థాలున్నట్టు ల్యాబ్ టెస్ట్‌ల్లో బయటపడిందని రఘురామ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని రఘురామ చెప్పారు.

మ‌ద్యం నాణ్య‌త‌పై ప‌రీక్ష‌లు చేయించ‌డం త‌ప్పా? లేదంటే ఆ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌ధానికి తెలియ‌జేయ‌డం త‌ప్పా? అని సభాముఖంగా జగన్ సర్కార్ తీరును, వైసీపీ ఎంపీల ధోరణిని ఎండగట్టారు.ఈ సందర్భంగా రఘురామ ప్రసంగానికి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అడ్డుపడ్డారు. రఘురామకు వ్యతిరేకంగా మార్గాని భరత్ ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, సభలో ఆ తరహా వ్యాఖ్యలు చేసిన సభ్యులను బయటకు పంపాలని రఘురామ…ప్యానెల్ స్పీకర్ రమాదేవికి రిక్వెస్ట్ చేశారు. దీంతో, భరత్ మాట్లాడిన మాటలను సభ రికార్డుల నుంచి తొలగించాలని ప్యానెల్ స్పీకర్ రమాదేవి ఆదేశించారు.

అంతకుముందు, రఘురామ ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి రజత్‌ భార్గవ అన్నారు.  చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్‌కు  రఘురామ టెస్ట్ చేయించిన మద్యం శాంపిల్స్‌ ఏపీ నుంచి సేకరించినవే అని చెప్పడానికి ఆధారాలు లేవని రజత్‌ భార్గవ అన్నారు. చెన్నై ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలీదని, శాంపిల్స్‌ను బీఎస్ఐ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా టెస్ట్ చేయలేదని ఎస్‌జీఎస్ తెలిపిందని చెప్పారు. అదేవిధంగా రసాయనాలు ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్షలు నిర్వహించలేదని,  శాంపిల్స్‌ హానికరం అని ఎస్‌జీఎస్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా లేదని అన్నారు.