బుగ్గన వారసుడిపై క్లారిటీ.. జగన్ లాజిక్ ఇదే!

మూడు నాలుగు రోజుల క్రితం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు మంత్రి బాలినేని సీఎం జగన్ తో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రస్తావన తేవటం.. దానికి ముందు ఆర్థిక మంత్రి బుగ్గనను ఈసారి బడ్జెట్ చదివేందుకు సూట్ లో రావాలని చెప్పామని.. వచ్చే ఏడాది బడ్జెట్ చదివేది ఎవరో? అన్న మాట.. తమ మధ్య వచ్చినట్లుగా చెప్పటం.. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి.. ‘అసలు మీరెందుకు ఆ విషయాలు మాట్లాడుకుంటారు’ అని అంటూనే..  కొత్త కేబినెట్ మీద కాసిన్ని మాటలు మాట్లాడటం తెలిసిందే.

అప్పటి నుంచి ఏపీలో కొత్త మంత్రివర్గం ఎలా ఉంటుంది? ఎవరు ఇన్? ఎవరు ఔట్? లాంటి చర్చ మొదలైంది. తాజాగా వస్తున్న అంచనాల్ని చూస్తుంటే.. ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చటం ఖాయమంటున్నారు. అందుకు కారణం.. ఆర్థిక శాఖను నిర్వహించటంలో ఆయనకు ఎలాంటి ఆసక్తి లేకపోవటమేనన్న మాట వినిపిస్తోంది. మరి.. ఆయన కాకుంటే మరెవరు? అన్న ప్రశ్నకు పలువురి పేర్లు వినిపిస్తున్నా.. అందులో బలంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి శిల్పా చక్రపాణి రెడ్డి అయితే.. రెండో పేరు విజయసాయి రెడ్డిగా చెబుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్న నేపథ్యంలో బుగ్గన అయితే.. అలవాటు అయిన మనిషే కాబట్టి.. ఆర్థిక బండిని ఎలా నడపాలన్న దానిపై అవగాహన ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నా.. ఆయన్ను పార్టీ బాధ్యతలు అప్పజెప్పి.. ఆర్థిక మంత్రిగా కొత్త వారు రావటం ఖాయమంటున్నారు. కీలకమైన ఆర్థిక శాఖను శిల్పా చక్రపాణి రెడ్డి అప్పగించే కన్నా.. ఆర్థిక లెక్కల విషయంలో తల పండిన విజయసాయికే ఎక్కువ అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మాట్లాడి.. నిధులు తెచ్చేందుకు శిల్ప కంటే కూడా విజయసాయి రెడ్డి అయితేనే.. పని తేలిగ్గా అవుతుందని చెబుతున్నారు.

తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిని ఆర్థిక మంత్రి పదవి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయిని.. రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవాలని జగన్ డిసైడ్ అయితే.. ఆయన్ను ఎమ్మెల్సీ కోటాలో తీసుకొని.. ఆర్థిక మంత్రిని చేస్తారంటున్నారు. అదే సమయంలో.. బుగ్గనను క్యాబినెట్ నుంచి తొలగించటం ఖాయమైతే.. ఆయన స్థానం విజయసాయిరెడ్డికి కట్టబెట్టే వీలుందంటున్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిపి ఏపీ మంత్రివర్గంలో 25 మంది ఉన్నారు. ఇటీవల హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డితో కలుపుకుంటే 26 మంది అవుతారు. కేబినెట్ లో ఆరుగురు ఎస్సీలు.. ఆరుగురు బీసీలు.. ఎస్టీ ఒకరు.. మైనార్టీ ఒకరు ఉన్నారు. 12 మంది ఓసీలు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కాంబినేషన్ లోనే కొత్త మంత్రివర్గం ఉంటుందని.. అందుకు తగ్గట్లుగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజం ఎంతన్నది జగన్ నిర్ణయం ప్రకటించినంతనే తేలనుంది.