జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పుచేశారు. తాను ముఖ్యమంత్రి కావటానికి కారణమైన పార్టీనే జగన్ పట్టించుకోలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రంలోని చాల చోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుకలను ఘనంగానే నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లిలోని సెంట్రల్ ఆఫీసులో కూడా వేడుకలు జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. పార్టీ జెండాను ఎగరేయటమే కాకుండా నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయిన జగన్ మాత్రం ఎక్కడా కనబడలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మించిన ముఖ్యమైన కార్యక్రమం జగన్ కు ఏముంటుంది ? ఈరోజు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవటానికి కారణమైన పార్టీనే జగన్ పట్టించుకోకపోతే ఎలాగ ?
శనివారం ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాల్లో జగన్ బిజీగా ఉన్నారా అంటే అదీలేదు. తాడేపల్లిలోనే ఉన్న క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఒక అర్ధగంట కూడా జగన్ పార్టీ వేడుకలకు కేటాయించలేకపోయారా ? ఇదే విషయమై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా సరే ఎంతబిజీలో ఉన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మాత్రం వదులుకోరు. కానీ జగన్ మాత్రం ఎక్కడా అడ్రస్ లేరు.
రాబోయేదంతా ఎన్నికల కాలమే. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ బాగా పెరిగిపోతోంది. ఇటు చంద్రబాబునాయుడు అటు పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ కార్యక్రమాల్లోనే బిజీగా గడుపుతున్నారు. మధ్య మధ్యలో పవన్ సినిమాల్లో బిజీగా ఉంటున్నా ఏమాత్రం ఖాళీ దొరికినా పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. ఇదంతా చూస్తు కూడా జగన్ ఆవిర్భావ దినోత్సవానికి కూడా రాకపోవటమే విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా వదిలేయటం బావోలేదు.