అదే నిజమైతే.. కేసీఆర్ సర్కారుకు షాకే

అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో పలు విమర్శల్ని ఎదుర్కొంటోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఎవరెన్ని చెప్పినా.. మాయదారి రోగానికి ముందస్తుగా నిర్దారణ పరీక్షలు చేయమంటే ససేమిరా అంటూ.. అత్యంత పొదుపును ప్రదర్శిస్తోంది. తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాల్లో రోజువారీగా విస్తారంగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. అందుకు భిన్నంగా వ్యవహరించటంలో ఉన్న మర్మం ఏమిటన్నది కేసీఆర్ అండ్ కోకు మాత్రమే అర్థమవుతుందన్న విమర్శలు ఉన్నాయి.

రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచటం మంచిదన్న వినతుల నేపథ్యంలో తెలంగాణ సర్కారు పది రోజుల వ్యవధిలో 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 30అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు.

పలువురు అనుమానితుల్ని పరీక్షలు జరిపిన నేపథ్యంలో వచ్చిన ఫలితాలు షాకింగ్ గా ఉన్నాయని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంగళవారం నిర్వహించిన 1231 శాంపిల్స్ లో పాజిటివ్ సంఖ్య ఏకంగా 17 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో జరిపిన నిర్దారణ పరీక్షల్లో ఇంత పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదైంది లేదన్న మాట వినిపిస్తోంది.

మంగళవారం నుంచి మొదలు పెట్టిన నిర్దారణ పరీక్షల విషయానికి వస్తే.. తొలి రోజున సుమారు 5400 టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన మొత్తం ఫలితాలు రావాల్సి ఉంది. ఒకవేళ.. ఈ శాంపిల్ టెస్టులకు కానీ పదిహేను శాతం చొప్పున పాజిటివ్ లు వస్తే.. కేసీఆర్ సర్కారుకు షాకింగ్ గా మారటం ఖాయమంటున్నారు.

అదే జరిగితే.. తెలంగాణ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొనే వీలుంది. మిగిలిన రాష్ట్రాల మాదిరి ముందస్తు పరీక్షల్ని ఆచితూచి చేయటం ద్వారా ఇప్పుడున్న పరిస్థితికి కారణమైందన్న భావన ప్రజల్లోనే కాదు.. ప్రతిపక్షాలు సైతం ఆరోపించే అవకాశం ఉంది.