టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం. త్వరలోనే కొత్త రేట్లు వస్తాయి. ఐదో షోకు కూడా అనుమతి ఇస్తాం.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు తనను కలిసినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలివి. ఇప్పుడున్న రేట్లతో థియేటర్లు నడపడం కష్టమన్న వాదనతో ఆయన ఏకీభవించారు. టికెట్ల ధరలు సవరించాల్సిన అవసరాన్ని గుర్తించినట్లే మాట్లాడారు.
ఆయనతో పాటు చిరు బృందంలోని వారు కూడా అతి త్వరలో కొత్త రేట్లతో జీవో వస్తుందన్నారు. ఐతే జగన్ స్వయంగా టికెట్ల రేట్లు పెంచడానికి, ఐదో షో వేసుకోవడానికి ఆమోదం తెలిపారు. జీవో అన్నది కేవలం లాంఛనమే అని అంతా అనుకున్నారు. ఆ మీటింగ్ తర్వాత రెండు మూడు రోజుల్లోనే జీవో వచ్చేస్తుందని అంతా ఆశించారు. కానీ రెండు వారాలు కావస్తున్నా జీవో ఊసే లేదు.
పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ రిలీజవుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఆ జీవోను ఆలస్యం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఐతే స్వయంగా సీఎం టికెట్ల ధరలు పెంచుకోవడానికి, ఐదో షో వేసుకోవడానికి సరే అంటూ ఆ సమావేశంలో చెప్పాక.. ఆ వీడియో కూడా బయటికి వచ్చాక ఇప్పుడు కేవలం లాంఛనం అనదగ్గ జీవో కోసం ఎదురు చూడ్డమేంటి? అంటే ముఖ్యమంత్రి మాటకు విలువ లేదన్నట్లేనా? జీవో ఇంకా రాలేదు అన్న విషయాన్ని పట్టుకుని భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాకు మరీ కనీస స్థాయి రేట్లతో టికెట్లు అమ్మాలని ఆదేశాలు జారీ చేయడమేంటి?
అసలు ఇప్పుడు దీన్ని మించిన సమస్య లేదన్నట్లుగా నిన్నట్నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి ఎమ్మార్వోల వరకు అందరూ భీమ్లా నాయక్ టికెట్ల ధరలు, షోల మీదే దృష్టిసారించడం.. థియేటర్ల యాజమాన్యాలను పిలిపించి సమావేశాలు నిర్వహించడం.. రిలీజ్ రోజు తనిఖీల కోసం బృందాలను సిద్ధం చేయడం ఏంటో అర్థం కావడం లేదు. పనిగట్టుకుని పవన్ సినిమాకే ఇలా చేస్తే జనాలు ఇది కక్షసాధింపుగా భావించకుండా ఎలా ఉంటారు?
Gulte Telugu Telugu Political and Movie News Updates