ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలే వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. అలాంటి నాయకుల్లో వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై జగన్‌ను కలవాలనుకుంటే ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. అయితే జిల్లాల విభజనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఆనం ఆగ్రహం వెనక మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత అయిన ఆనంకు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. పైగా తనకు వ్యతిరేకంగా వైసీపీలో కుట్ర జరుగుతుందని ఆయన భావిస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్‌కు ఆనంకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాల డిమాండ్‌తో ఆయన తన అసంతృప్తికి వెళ్లగక్కుతున్నారని సమాచారం.
మరోవైపు జగన్ తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆనం వైసీపీని వీడి టీడీపీలో చేరాలని అనుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా తమ కుటుంబానికి ఎలాంటి పదవులు దక్కలేదనే అసహనంతో ఆయన వైసీపీలో చేరారు.
2019లో వైసీపీ నుంచి వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ సీనియర్ నేత అయిన ఆయన్ని జగన్ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. రాజీపడి వైసీపీలో చేరినా ఏం ఒరగడం లేదనే అభిప్రాయంతో ఆనం ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ టీడీపీ వైపు మనసు లాగుతుందని అంటున్నారు. నెల్లూరులో టీడీపీకి సోమిరెడ్డి చంద్రమోహన్ తప్ప మరో బలమైన నేత లేరు. ఆనం ఒకవేళ పార్టీలోకి వస్తే అది టీడీపీకి లాభించేదే. కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఆనం ఆలోచిస్తున్నారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ గెలిస్తే అప్పుడు తన మంత్రి పదవికి సోమిరెడ్డి అడ్డంకి అవుతారని ఆనం భావిస్తున్నారంటా. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి మంత్రి పదవి వస్తుందనే భరోసా వస్తే ఆనం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates