ఈ పార్టీని గెలిపిస్తే.. మీ ఇంటికి బెంజ్ కార్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయం వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కేసీఆర్ యుద్ధం ప్ర‌క‌టించ‌డం, రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్ తీరుపైనా స్పందిస్తున్న త‌రుణంలో ఎన్నిక‌ల హీట్ వ‌చ్చేసిందా అన్న టాక్ న‌డుస్తోంది. అయితే, ఇదే స‌మ‌యంలో తెలంగాణలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న ఓ పార్టీ ర‌థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నే బీఎస్పీ ముఖ్య నేత‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌. ఆయ‌న చేసిన కామెంట్‌ ఏంటంటే… `మేం గెలిస్తే మీ ఇళ్ల‌లోకి బెంజ్ కార్లు తెస్తాం `అనే ఆస‌క్తిక‌ర‌మైన హామీ.

కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగి బీసీ సమ్మేళనంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాజం ఇప్పుడు ప్రమాదంలో ఉందన్నారు. 75 సంవత్సరాలుగా ఈ పాలకుల తీరుతో మనం ఏడుస్తూనే ఉన్నామని ప్రవీణ్ కుమార్ అన్నారు. “నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలన్నీ ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయలాంటి పథకాల కాంట్రాక్టులనీ అధిపత్య వర్గాల దగ్గరే ఉన్నాయి. అగ్రకులాల వారే స్కూళ్లు, యూనివర్శిటీలు, ఆస్పత్రులు ఎందుకు పెట్టగలుగుతున్నారు? మేం మాత్రం కూలీలుగా, పేషెంట్లుగా, అత్యాచార బాధితులుగా ఎందుకుంటున్నాం?“ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

ఒకప్పుడు మతకల్లోలుంటే.. ఇప్పుడు కేసీఆర్ కుల కల్లోలాలు సృష్టిస్తున్నాడని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆరోపించారు. కులాల జనాభా ఆధారంగా మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఇవ్వాలన్నారు. ఓటు అనే ఆయుధంతో ఎన్నికల్లో మన వాళ్లను గెలిపించుకుందామన్నారు.

మనం బాగుపడాలంటే ఏనుగు గుర్తుకే ఓటేయాలని   పోలింగ్ రోజు ఏనుగు గుర్తుమీద ఓటేయాలని ఇప్పటి నుంచి అనుకోవాలని సూచించారు.  తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకువస్తామని ప్ర‌వీణ్ కుమార్ హామీ ఇచ్చారు. బహుజన రాజ్యం వస్తే ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు… కార్పోరేట్ సంస్థలకంటే మిన్నగా తీర్చిదిద్దుతామన్నారు. బీఎస్పీ గెలిస్తే.. మీ ఇండ్లలోకి బెంజ్ కార్లు వచ్చేలా చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.