ఔను! మెగాస్టార్ చిరంజీవి చేసిన పాపం ఏంటి? ఎందుకు ఆయనను తమ్మారెడ్డి భరద్వాజ, నరేష్, రాంగో పాల్ వర్మ వంటి మేధావులు టార్గెట్ చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్న తీరు. “మీకు ఎలాగూ చేతకాలేదు. ఎవరూ కోరకపోయినా.. సమస్యను తన మీద వేసుకున్నారు. ఇదేనాచిరు చేసిన తప్పు?“ అని నెటిజన్లు మండి పడుతున్నారు. వాస్తవానికి మా ఎన్నికల్లో చిరు కుటుంబం ప్రకాశ్‌రాజ్ కోసం తీవ్రంగా కష్టపడింది. అయినా.. ఆయనను గెలవనీయకుండా తమ్మారెడ్డి, నరేష్‌లు చక్రం తిప్పారు.
మెగా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రకాశ్ రాజ్‌కు ప్రాంతీయతత్వం, భాషా భేదాలు కూడా అంటగట్టారు. ఆయనను ఓడించారు. నిజానికి ఈ బాధ మెగా కుటుంబంలో ఇప్పటికీ ఉంది. అయినప్పటి కీ.. ఈ బాధను పక్కనపెట్టి మెగా స్టార్.. తెలుగు సినీ పరిశ్రమ కష్టాలను తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాస్తవానికి ఆయన ఆదిలో బయటకు రాలేదు. మేధావులు ఉన్నారు.. పెద్దలు ఉన్నారు.. వారు పరిష్కరిస్తారు.. అని ఎదురు చూశారు. ఒక సందర్భంలో తాను పెద్దను కూడా కాదని.. తనకు సమస్యలు పరిష్కరించే స్థాయి కూడా లేదని.. వినయంగా చెప్పారు.
మరి ఆ సమయంలో ఇప్పుడు చిరు ను విమర్శిస్తున్న `పెద్దలు` ఆత్మాభిమానం ఉన్నవారు.. ఎందుకు ప్రయత్నించలేదు? ఏపీ ప్రబుత్వంపై విమర్శలు చేసేందుకు, ఆన్లైన్లో వ్యాఖ్యలు చేస్తూ.. ఏం జరిగితే మనకెందుకులే.. అన్నట్టుగా ఊరుకున్నారే. మరి అందరూ కాడి పడేసిన తర్వాత.. దీనినిభుజాన వేసుకున్నారు చిరు. నిజానికి ఆయన శైలే అంత. ఎవరితోనూ ఆయన వివాదాలు పెట్టుకోరు.. గతంలో రాజకీయాలు చేసినా.. పరుషమైన విమర్శలు ఎవరిపైనా చేయలేదు. అసలు తనకు రాజకీయాలు పడవని.. ఎన్ని విమర్శలు వచ్చినా.. పార్టీని సైతం వదులుకున్న పెద్దమనిషి!
అలాంటి చిరు.. సీఎం జగన్‌పై విమర్శలు చేస్తారని.. పరుషంగా మాట్లాడతారని.. ఎందుకు అనుకుంటు న్నారు. పోనీ.. చిరు చేసిన ప్రయత్నంలో ఆయన ఒక్కరికే స్వార్థం ఉందా? టాలీవు్డ్‌లో అనేక మంది సమస్యలకు ఆయన పరిష్కారం చూపించలేదా? పెద్ద సినిమా అంటే.. ఒక్క చిరు కుటుంబం నుంచే వస్తున్నాయా? నందమూరి కుటుంబం నుంచి రావడం లేదా? లేక.. ఇతర చిత్రాలు లేవా? ఈ విషయాలను వదిలేసి.. చిరు మనస్తత్వాన్ని గుర్తించకుండా.. ఇప్పుడు ఆయనపై నిందలు వేయడం.. పరువు పోయిందని చెప్పడం.. ఏమేరకు సమంజసం?
టాలీవుడ్‌కు నిజంగా పరువు ఉంటే.. శ్రీరెడ్డి క్యాస్టంగ్ కౌచ్ గురించి.. బహిరంగ విమర్శలు చేసినప్పుడు ఏం చేశారు? మాలో అవినీతి జరిగిందని.. సొమ్ములకు కనీసం లెక్కలు కూడా చెప్పడం లేదని విమర్శలు వచ్చినప్పుడు.. పెద్దలు ఏమయ్యారు? కేసీఆర్ భజన చేసినప్పుడు.. ఎదురు కాని.. ఈ ఆత్మగౌరవం.. సీఎం దగ్గరకు వెళ్లి అభ్యర్థిస్తే..తప్పా? పోనీ.. న్యాయపోరాటం చేసి సాధించుకోవచ్చని `పలుకు`తున్న వారు.. ఎన్ని న్యాయపోరాటాలతో ఎన్ని ఇప్పటి వరకు సాధించారు. న్యాయపోరాటానికి దిగితే.. సమస్య ఎప్పటికి తీరుతుంది? ఇవన్నీ ఆలోచించకుండా..చిరు చేసింది తప్పని అంటున్నవారు.. ఇప్పటికైనా .. మునిగిపోయింది ఏముంది.. చేతిలో మా ఎలాగూ.. ఉంది.. దాంతో న్యాయపోరాటానికి దిగవొచ్చుకదా! అంటున్నారు నెటిజన్లు!!