ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ను కేంద్రం పరిశీలిస్తోందా? నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినప్పటికీ బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి కారణం…రాష్ట్ర విభజన అనంతరం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా అందులో ప్రత్యేక హోదాకు స్థానం కల్పించడం ద్వారా ఈ మేరకు కొత్త చర్చకు చాన్స్ ఇచ్చినట్లయింది. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉండగా ఈ నెల 17 న కమిటీ తొలి సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకే త్రి సభ్య కమిటీ అంటూ పేర్కొన్న హోంశాఖ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చడం గమనార్హం.
ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతోపాటు ఈ కమిటీ సమావేశంలో ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరు వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌పై చర్చించనుంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలలో ప్రత్యేక హోదా ప్రతిపాదన ప్రస్తావించడంతో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని పలువురు అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గతంలో ప్రకటన చేసిన కేంద్రం.. ప్రస్తుతం హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా విషయాన్ని చేర్చడం కీలకమైన పరిణామంగా చెప్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. తాజా నిర్ణయంతో ముగిసిపోయిందనుకున్న ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.