ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహ పరంపర కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ను చాలా అవమానకర రీతిలో విభజించారని ప్రధాని మండిపడిన సంగతి తెలిసిందే. మైకులు బంద్ చేసి పెప్పర్ స్ప్రే చల్లి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసినట్లు ప్రధాని చేసిన కామెంట్లపై టీఆర్ఎస్ చేస్తున్న నిరసనలో భాగంగా తాజాగా ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు.
తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటులో పాస్ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని తెలిపారు. పార్లమెంటును, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు.
కాగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో దిష్టిబొమ్మల దహనాలు, నిరసన ప్రదర్శనలు, మోడీ వ్యతిరేక నినాదాలతో టీఆర్ఎస్ పార్టీ హోరెత్తించింది. రాష్ట్ర విభజనపై ప్రధాని వ్యతిరేక వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తెలంగాణ ఉద్యమకారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. నల్లటి అంగీలు, రిబ్బన్ల్లు ధరించి ర్యాలీలు చేపట్టారు. ‘మోడీ హఠావో.. తెలంగాణ బచావో’ ప్లకార్డులతో బైఠాయించారు. దీనికి కొనసాగింపు అన్నట్లుగా నేడు రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు.