నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కి కరోనా సోకింది. ఈయన వయసు 67 సంవత్సరాలు. నాలుగు రోజులుగా ఆయనకు ఒంట్లో నలతగా ఉందని… ఎందుకైనా మంచిదని ఆయనకు, భార్యకు పరీక్షలు చేయించారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. భార్యకు మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో వారిద్దరిని హైదరాబాదుకు తరలించారు.
ఇటీవలే జగనాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్యకు మరో నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
రాజకీయ నాయకులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. శనివారం బాజిరెడ్డి గోవర్దన్ డిచ్ పల్లి మండలం బీబీపూర్ తండాలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలోను పాల్గొన్నారు. ఇందులో వందల మంది జనం పాల్గొన్నారు. హాజరైన వారిలో లబ్ధిదారులతో పాటు అధికారులు, నేతలు, పలువురు స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఎటువంటి సభలు, సమావేశాలు జరపవద్దని స్పష్టంగా చెబుతున్నా ఎవరు వినడం లేదు.
ఇపుడు ఈయనకు పాజిటివ్ వచ్చింది. నిన్నటి సమావేశానికి హాజరైన వారి పరిస్థితి ఏమిటి? ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకపోయినా జరుగుతుంది కదా.. ఎందుకు ఆయన ప్రమాదంలో పడి, ప్రజలను కూడా ప్రమాదంలోకి నెట్టాలి. నేతలు ఇలా చేస్తే జనం ఊరుకుంటారా? సమావేశానికి వచ్చిన వారందరినీ ఇపుడు క్వారంటైన్ కి తరలించారట. ఎమ్మెల్యే వచ్చినపుడు చాలా మంది స్థానికులు అక్కడికి చేరుకుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి?
అందుకే నేతలు కొన్ని నెలలు ఇలాంటి జనసమ్మర్థ కార్యక్రమాలను దూరంగా పెడితే అందరికీ మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates