దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న ప్రధాని మోడీ నిర్ణయానికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ జై కొట్టారు. ఈ మేరకు ఆయన 5 పేజీల లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ సవరణలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఐఏఎస్ కేడర్ నిబంధనల్లో సవరణలకు మద్దతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే, రాష్ట్రాల అంగీకారం లేకుండానే కేంద్రం అధికారులను డెప్యుటేషన్కు తీసుకెళ్లే అంశంపై ఓమారు ఆలోచించాలని సీఎం కేంద్రాన్ని కోరారు.
అకస్మాత్తుగా ఐఏఎస్‌లను డెప్యుటేషన్కు వెళ్లేందుకు రిలీవ్ చేయాల్సివస్తే.. కీలకమైన ప్రాజెక్టులు, పథకాల లక్ష్యాలు దెబ్బతింటాయని లేఖలో వెల్లడించారు. ఐఏఎస్‌లను డిప్యుటేషన్‌పై పంపేందుకు సరిపడా అధికారులు లేరన్న సీఎం.. ఎక్కువ మంది అధికారులను కేటాయిస్తే డిప్యుటేషన్‌పై పంపొచ్చని తెలిపారు. కేంద్ర డెప్యుటేషన్కు వెళ్తామని అభ్యర్ధించే ఐఎఎస్‌లకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేస్తోందని అన్నారు.
రాష్ట్ర కేడర్ నుంచి వచ్చి కేంద్రంలో డిప్యుటేషన్‌పై పనిచేసే అధికారుల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొంటూ ఐఏఎస్ కేడర్ రూల్స్-1954కు మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ పరస్పర సంప్రదింపుల ద్వారా కేంద్రం, రాష్ట్రాలు అధికారుల డిప్యుటేషన్‌కు అనుమతులిచ్చేవి. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం.. ఏ అధికారినైనా డిప్యుటేషన్‌పై పంపించాలని కేంద్రం కోరితే ఆ అభ్యర్థనను తోసిపుచ్చే అవకాశం ఇక రాష్ట్రాలకు ఉండదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది.
ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని కోరుతూ గత ఏడాది డిసెంబరు 20, 27, ఈ ఏడాది జనవరి 6,12 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్ కేడర్ నిబంధనల మార్పుపై ఇప్పటి వరకు 18 రాష్ట్రాలు తమ స్పందనలను తెలియజేశాయి. వాటిలో 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా…మరో 9 రాష్ట్రాలు సమర్థించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కేంద్రం ప్రతిపాదనకు సానుకూలత తెలపగా.. తెలంగాణ మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates