కొత్త జిల్లాలు… వైసీపీలోనే ఇంత వ్య‌తిరేక‌తా!

వైసీపీ నేత‌ల మ‌ధ్య ఇప్పుడు ఈ మాటే జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. తాడేప‌ల్లి ఆఫీస్ నుంచి కూడా కొంద‌రు కీల‌క నేత‌ల‌కు ఫోన్లు కూడా వెళ్తున్నాయి. అర్ధం చేసుకోండి సార్‌! అంటూ.. నేత‌ల‌ను బుజ్జ‌గిస్తు న్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యాల‌ను కొంద‌రు సొంత పార్టీ నాయ కులే వ్య‌తిరేకిస్తుండ‌డం. వాస్త‌వానికి ఎక్క‌డైనా.. ప్ర‌భుత్వ పార్టీ నాయ‌కులు స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యా ల‌ను స్వాగ‌తించాల్సినఅవ‌స‌రం ఉంటుంది. కానీ, వైసీపీలో మాత్రం ప్ర‌తిప‌క్ష నేత‌ల కంటే ముందుగానే సొంత పార్టీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌ల బాణాలు వ‌చ్చాయి.

గుంటూరు జిల్లాలో ప‌ల్నాడు జిల్లాకు ఆ పేరు వ‌ద్దంటూ.. తొలుత‌.. ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తే డిమాండ్ చేశారు. ఈ జిల్లాకు.. మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు పేరును పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక‌, ప్రకాశం జిల్లాలోని కందుకూరును రెవెన్యూ డివిజన్ గా కొనసాగించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుం ట మహీథర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన జిల్లాల్లో భాగంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతూ ప్రతిపాదించారు. ఈ విషయమై ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కందుకూరు రెవెన్యూ డివిజన్ ఉనికిని కోల్పోతోంద‌ని అన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ను లేకుండా చేయడం మంచిది కాదన్నారు. రెవెన్యూ డివిజన్ లో ఎన్ని మండలాలు ఉంటాయన్నది ప్రశ్న కాదని, కందుకూరు రెవెన్యూ డివిజన్ గా కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటి కే లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.  ఇక‌, అన్న‌మ‌య్య జిల్లాఏర్పాటుపై రాయ‌చోటిలో వైసీపీ నేత‌లే అగ్గిరాజేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ‌ను రాజంపేట కేంద్రం గా జిల్లా ఏర్పాటు చేయాల‌ని.. రాయ‌చోటివ‌ద్ద‌ని చెబుతున్నారు.

ఇలా.. అన్ని వైపుల నుంచి వైసీపీ నేత‌లే గొంతు విప్పుతుంటే.. ప్ర‌బుత్వానికి కూడా చిర్రెత్తుకొస్తున్న ప‌రిస్థి తి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిని బుజ్జ‌గించేందుకు శ‌త విధాల ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎలాంటి డిమాండ్లు లేక‌పోవ‌డం.. ఏదో ఒక‌టి రెండు చోట్ల మాత్ర‌మే డిమాండ్లు వినిపిస్తుండ‌గా.. మిగిలిన రాష్ట్రం అంతా కూడా.. ఎక్క‌డా టీడీపీ నేత‌ల హ‌డావుడి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే సొంత పార్టీ నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు వైసీపీ అధిష్టాన‌మే రంగంలొకి దిగింద‌ని తెలుస్తోంది.