ఏపీలో కొత్త జిల్లాల‌పై బాల‌య్య రియాక్ష‌న్‌

ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌తిపాదించిన జిల్లాల ఏర్పాటు.. అంశంపై హిందూపురం ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య రియాక్ట్‌.. అయ్యారు. నిజానికి జిల్లాల ఏర్పాటు అంశం తెర‌మీదికి వ‌చ్చి రెండు రోజులు అయినా.. స్పందించ‌లేద‌నే కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్య‌లో తాజాగా బాల‌య్య రియాక్ష‌న్ అంద‌రి నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. రాష్ట్ర ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన జిల్లాల ఏర్పాటును ఆయ‌న స్వాగ‌తించారు. జిల్లాల ఏర్పాటు మంచిదేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే… ఈ విష‌యంలో రాజ‌కీయాలు వ‌ద్ద‌ని కామెంట్ చేశారు.

ప్ర‌స్తుతం బాల‌య్య ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అనంత‌పురం జిల్లాను స‌ర్కారు రెండుగా జిల్లాలుగా విడ‌దీసింది. అనంత‌పురం జిల్లాలోని  రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో అనంత‌పురం కేంద్రంగా  అనంతపురంజిల్లా ఏర్ప‌డ‌నుంది. కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్ రెవెన్యూ డివిజ‌న్ల‌తో  34 మండలాలు ఉంటాయి.

ఇక‌, అనంత‌పురం జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ‌క‌వ‌ర్గాల‌తో పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా కొత్త‌గా శ్రీసత్యసాయిజిల్లా ఏర్ప‌డ‌నుంది. పెనుగొండ , పుట్టపర్తి, కదిరి రెవ‌న్యూ డివిజ‌న్లు, 29 మండలాలు ఉంటాయి. అయితే.. దీనిపైనే బాల‌య్య అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే అన్ని రూపాల్లోనూ అభివృద్ధి చెందిన హిందూపురం ప్రాంతాన్ని.. స‌త్య సాయి జిల్లాకు కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. ఇక్క‌డైనా.. అన్ని విధాలాప్ర‌భుత్వానికి అనువైన స్థ‌లాలు ల‌భిస్తాయ‌ని, కార్యాల‌యాలుఇత‌ర మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేసుకునే ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

“హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందింది.  హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాలి. హిందూపురం ప‌ట్ట‌ణ ప‌రిస‌రాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటు, భ‌విష్య‌త్ అవ‌స‌ర‌మైన భూమి పుష్క‌లంగా ఉంది. ఇక‌, జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్దు. హిందూపురం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి.. వారి చిరికాల కోరికైన హిందూపురం ప‌ట్ట‌ణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే నే బాగుంటుంది“ అని బాల‌య్య వ్యాఖ్యానించారు.