ఔను.. తెలంగాణ రూపు రేఖలు మరింతగా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత వృద్ధి చెందడంతోపాటు.. భూముల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న కొల్లాపూర్ (167కే) జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించి డీపీఆర్‌ని కేంద్రం ఆమోదించిం ది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి ఆమోద ముద్రవేసింది.
ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సోమశిల వంతెన నిర్మాణం కూడా పూర్తి కానుంది. రెండు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న కొల్లాపూర్ (167కే) జాతీయ రహదారికి దాదాపు 173.73 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బైపాస్, రీ అలైన్‌మెంట్ల నిర్మాణాలూ ఉంటాయి. కొల్లాపూర్ (167కే) జాతీయ రహదారి నిర్మాణం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది.
కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీ పంలో కృష్ణానదిపై రీ అలైన్‌మెంట్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఫలితంగా ఆయా ప్రాంతాలు మరింత విస్తరించడం తోపాటు.. సమీపంలోని భూములకు మరింత ధరలు పెరగనున్నాయి. అంతేకాదు.. రియల్ ఎస్టేట్ మరింతగా పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. అదేసమయంలో ఏపీ నుంచి పెట్టుబడులు కూడా భారీగా వస్తాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
కొల్లాపూర్ జాతీయ రహదారి నిర్మాణం.. మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. ఇక, ఇది రాజకీయంగా కూడా వచ్చే ఎన్నికల్లో కీలక రోల్ పోషించనుంది. దీనిని తీసుకువచ్చింది తామేనని కేసీఆర్ సర్కారు చెప్పుకొనే ప్రయత్నం చేయగా.. కేంద్రంలోని మా నాయకులే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. నిధులు కూడా ఇస్తున్నారని.. బీజేపీ నేతలు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా.. కొల్లాపూర్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే.. తెలంగాణ రూపు రేఖలు మారతాయని అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు.