‘ఊ అంటావా సీఎం… ఉఊ అంటావా’

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై పేర‌డీ సాంగ్స్ వ‌ర‌ద‌లా వ‌చ్చేస్తున్నాయి. ఆయ‌న పాల‌న‌, ఉద్యోగుల‌కు సంబంధించి ప్ర‌క‌టించిన పీఆర్సీ వంటి అంశాల‌ను జోడిస్తూ.. ఉద్యోగులు త‌మ నిర‌స‌న‌ల్లో భాగంగా పేర‌డీ సాంగ్స్‌తో కుమ్మేస్తున్నారు. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఉ-అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అనే సాంగ్‌తో నటి సమంత, పుష్ప మూవీలో దుమ్ములేపింది. ఇప్పుడు ఆ పాట అన్నిసోష‌ల్‌ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. నోరు తెరిచారంటే చాలు ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ అందరూ మంత్రంలా జపిస్తున్నారు. ఇప్పుడు ఈ పాట ప్రతి ఒక్కరికీ ఓ ఆయుధంగా మారింది. అది నిరసన అయినా ఆందోళన కార్యక్రమైనా… సందర్భం ఏదైనా సరే తమ నిరసనను ఊ అంటావా మావా అనే పాట పల్లవి మార్చి తమ ప్రత్యర్థులపై విసురుతున్నారు.

https://www.youtube.com/watch?v=zVJWsk5hJRI&ab_channel=FridayCulture

‘రివర్స్‌ పీఆర్సీ’పై ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు తమ నిరసనలకు సృజనాత్మకతను కూడా జోడించారు. పేరడీ పాటలతో జగన్‌ సర్కారుకు చురకలు అంటించారు. తమకు న్యాయమైన పీఆర్సీ కావాల్సిందే అంటూ… ‘ఊ అంటావా సీఎం… ఉఊ అంటావా’ అని పాటరూపంలో ప్రశ్నించారు. ‘కొత్త కొత్త జీతాలన్నావు.. పాతపాత జీతాలకు ఎసరుపెట్టావు’ అంటూ దుమ్మెత్తిపోశారు. ప్ర‌స్తుతం ఈ పాట కూడా మిలియ‌న్ షేర్‌లు దాటేలా ఉంద‌ని స‌మాచారం.

మరోచోట…’ఇంతన్నాడు అంతన్నాడే జగన్‌’ అంటూ చివరికి తమకు మోసం చేశారని మండిపడ్డారు. ఇంకోచోట… ‘అయ్యయ్యో వద్దమ్మా’ ప్రకటనకు పేరడీ కట్టారు. “అయ్యయ్యో వద్దమ్మా… పక్కనే సీఎం ఉన్నాడు… పెద్ద పీఆర్సీ ఇస్తానన్నాడు… ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందన్నాడు… మా దగ్గరే పది పైసలు పట్టుకుని పోయాడు… సుఖీభవ… సుఖీభవ” అని చిందేశారు. మొత్తానికి పేర‌డీ సాంగ్స్ ఈ రేంజ్‌లో ఒక సీఎంపై రావ‌డం ఇదే తొలిసార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. న‌వ్వుకునేందుకు మాత్ర‌మేన‌ని.. స‌ద‌రు పాట‌లు రాసిన వారు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.