యావత్ ప్రపంచం మాయదారి రోగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. అంతకంతకూ విస్తరిస్తున్న మహమ్మారి నేపథ్యంలో అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ప్రముఖులు.. సామాన్యులు అన్న తేడా లేకుండా అంటేస్తున్న మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మరిన్ని జాగ్రత్తలు అవసరం.
ఈ విషయాన్ని పట్టించుకోని వారంతా ఇప్పుడు పాజిటివ్ బారిన పడటాన్ని మరిచిపోకూడదు. ఇటీవల కాలంలో దేశంలోనూ.. అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల జోరు పెరిగింది. లాక్ డౌన్ వేళ.. ప్రపంచంలో మన దేశంలో నమోదైన పాజిటివ్ ల సంఖ్య పరిమితంగా ఉండేది. లాక్ డౌన్ ఎత్తేసి ఆన్ లాక్ 1.0 పూర్తిస్థాయిలో షురూ అయిన నాటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే వీలుంది.
ఇలాంటివేళ.. ఆగస్టు నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తానని.. పల్లెబాటను షురూ చేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందలేదనే ఫిర్యాదులు ప్రజల నుంచి రావొద్దన్నఆయన.. ఆగస్టులో గ్రామాల్లో పర్యటిస్తే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరో నెలన్నర కంటే ఎక్కువే సమయం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు ఏ మాత్రం సరి కాదంటున్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే సందేశాలకు బదులు.. ముఖ్యమంత్రే గ్రామాల్లో పర్యటిస్తామని చెబుతున్నారు. మనకేం కాదులే అన్న అనవసరమైన ధీమా పెరుగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో.. నిత్యం బిజీ షెడ్యూల్ లో ఉన్న జగన్.. పాలనా రథాల్ని మరింత వేగంగా పరుగులు తీయించాలని భావిస్తున్నారు. ఆయన ఉత్సాహాన్ని తప్పు పట్టలేం కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తన వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.
గ్రామాల్లో పర్యటిస్తాననే ప్రకటన.. అపాయానికి ఎదురెళ్లటమే తప్పించి మరొకటి కాదంటున్నారు. మహమ్మారి ముప్పు పూర్తిస్థాయిలో తొలిగే వరకూ.. పూర్తి రక్షణ చట్రంలో ఆయన ఉండేలా ప్లాన్ చేసుకోవటా చాలా అవసరమన్న మాట వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates