వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన గుండెపోటుతో మరణించారని విజయసాయి ప్రకటించారని, తర్వాత గొడ్డలి పోటుతో మరణించారని తెలిసిన తర్వాత టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపించారని అన్నారు. అసలు వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసునని.. చివరికి సీబీఐ విచారణలో వైసీపీ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయన్నారు.
రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఏదీ ఏమైనప్పటికీ గొడ్డలి పోటును.. గుండె పోటని ఎందుకు చెప్పావ్?.. ఎవరు చెప్పమన్నారని విజయసాయికి రఘురామ సూటిగా ప్రశ్నించారు. ఎవరిని కాపాడ్డానికి ఈ ఘటనను టీడీపీపైకి నెట్టారని నిలదీశారు.
హత్యలు చేసేది ఎవరో.. ఆ ట్రాక్ రికార్డు చూసి భయపడుతున్నామని రఘురామ అన్నారు. వివేకాను హత్య చేసింది ఎవరో తెలుసునని, చేయించింది ఎవరో త్వరలోనే బయటకు వస్తుందన్నారు. మరి ఏపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే భయపడొద్దంటావా? విజయసాయీ.. అంటూ రఘురామ అన్నారు. భయపడి తాను పారిపోలేదని, రావలసిన చోటుకు వచ్చానన్నారు. తనను మర్డర్ చేస్తారనే ప్లాన్ విషయం తెలిసే.. ప్రాణ రక్షణ కోసం ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చానని రఘురామ స్పష్టం చేశారు. ఇదిలావుంటే, రాష్ట్ర సీఐడీ పోలీసులకు రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఇవాళ విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. ఢిల్లీ వెళ్లాక తన ఆరోగ్యం బాగాలేదని పేర్కొన్నారు. తనపై నమోదైన కేసుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా.. తనకు 4 వారాల గడువు ఇవ్వాలని సీఐడీని కోరారు.
జనవరి 12వ తేదీన హైదరాబాద్లోని ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి అధికారులు వెళ్లిపోయారు. సీఐడీ నోటీసులపై స్పందించిన ఎంపీ రఘురామ.. రాష్ట్ర ప్రభుత్వం తనపై కొత్తగా కేసులు పెట్టిందన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఐడీ నోటీసులు, తదితర కారణాల నేపథ్యంలో ముందుగా ప్రకటించిన భీమవరం పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates