ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా వినిపించే పేరు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణమ రాజు. తన పదునైన వ్యాఖ్యలతో ఏపీ అధికారపక్షానికి తలనొప్పిగా మారిన ఆయనపై వేటు వేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. కొరుకుడు పడని రీతిలో తయారైన ఆయన.. తనకు తానుగా రాజీనామా చేస్తే తప్పించి.. ఆయనపై వేటు వేయించలేని పరిస్థితి ఉందన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే తాను ఫిబ్రవరి 5 తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ రాజు ప్రకటించటం తెలిసిందే. దీంతో.. రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
తాను చెప్పినట్లుగా రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? లేదంటే.. మరో ట్విస్టు ఇస్తారా? అన్న విషయం మీద మాత్రం సందేహాలు ఉన్నాయి. మరోవైపు ఎంపీ రఘురామ రాజీనామా చేస్తే.. ఆ తర్వాత చోటు చేసుకునే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా.. ఇప్పటికే ప్లానింగ్ ను వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రఘురామ చెప్పినట్లే రాజీనామా చేసి.. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించిన తర్వాత నుంచి ఆర్నెల్ల లోపు ఉపఎన్నికలు రావటం ఖాయం.
అప్పటికప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసే కన్నా.. ముందే.. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ సీఎం జగన్ పక్కాగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సర్వేలు పూర్తి చేయటంతో పాటు.. అక్కడ ఎవరికి విజయావకాశాలు ఉన్నాయన్న విషయంపై ఒక స్పష్టతకు వచ్చినట్లుగా చెబుతున్నారు. నరసాపురం ఉప ఎన్నిక మీద ఏ ఒక్క వైసీపీ నేత ఇప్పటివరకు అధికారికంగా మాట్లాడింది లేదు. ఆ మాటకు వస్తే.. అనధికార సంభాషణల్లోనూ ఈ అంశంపై మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడని పరిస్థితి.
అయితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రఘురామ రాజుకు పోటీగా బరిలోకి దించాల్సిన అభ్యర్థి విషయంపై సీఎం జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. కేవలం అమలు మాత్రమే మిగిలినట్లు చెబుతున్నారు. రఘురామ రాజీనామాతో నరసాపురం ఎంపీ సీటు ఖాళీ కావటం ఖాయం. దానికి జరిగే ఉప ఎన్నికల్లో రఘురామ పోటీకి దిగనున్నారు. ఆయన నిలబడే పార్టీ ఏదైనా.. ఆయనకు టీడీపీ.. జనసేనలు మద్దతు ఇవ్వటం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆయనకు పోటీగా వైసీపీ తన అభ్యర్థిని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేసినట్లే..
నరసాపురం ఉప ఎన్నికకు రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎంవీజీకే భానును బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. సమర్థవంతమైన అధికారింగా పేరున్న ఆయన తెలుగువాడన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఆయనకు ఐఏఎస్ అధికారులతో బలమైన సంబంధాలు ఉన్నాయని చెబుతారు. 1958లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జన్మించిన భానును డైనమిక్ అధికారిగా అభివర్ణిస్తారు. 1985 బ్యాచ్ కు చెందిన అసోం.. మేఘాలయ కేడర్ అధికారిగా అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెబుతారు.
1990లో విజయవాడ కార్పొరేషన్ కు ప్రత్యేక అధికారిగా పని చేసిన ఆయన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన కార్యదర్శిగా వ్యవహరించేవారు. తర్వాత రోశయ్య వద్ద కార్యదర్శిగా పని చేసిన ఆయన.. 2019 వరకు అసోం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేసి పదవీ విరమణ పొందారు. అప్పటి ప్రధాని మన్మోహన్ చెప్పిన మీదట 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తేజ్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు కానీ ఓడిపోయారు.
2018లోనే ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయిన ఆయన.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా చెప్పాలి. దీంతో.. నరసాపురం ఉప ఎన్నిక జరిగితే.. దానికి భాను అభ్యర్థిత్వం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే సర్వే ఫూర్తి చేశారని.. దానికి సానుకూల ఫలితం వచ్చిందని చెబుతున్నారు.భాను గెలుపు బాధ్యతను స్థానికంగా క్షత్రియ.. కాపు వర్గానికి చెందిన మంత్రులకు సీఎం జగన్ ఇస్తారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఎప్పుడో జరిగే నరసాపురం ఉప ఎన్నికకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పక్కాప్లాన్ సిద్ధం చేశారని.. కేవలం ప్లాన్ ను అమల్లోకి తీసుకురావటం మాత్రమే మిగిలిందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates