తెలుగు రాజకీయాల్లో మర్యాదలు పోయి చాలా కాలమే అయ్యింది. తక్షణ రాజకీయ ప్రయోజనం తప్పించి.. విలువలు.. సిద్దాంతాలు.. భౌతికంగా లేని వారిపై విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు చేయకూడదన్న విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నారు. మన మధ్య లేని వారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా.. వచ్చే లాభం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మన మధ్య లేని వాళ్ల మీద ఎంతగా విరుచుకుపడినా.. సదరు వ్యక్తి తన వాదనను వినిపించే వీలు ఉండదు.
ఉన్న వారి వారసులు రియాక్టు అయినా అదంతా సరిగా ఉండదు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాజకీయాల్లో సంచలనంగా చెప్పుకునే పరిటాల రవి మీద ఆయనఘాటు విమర్శలు చేయటం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఈ మధ్యన 2019లోపోటీ చేసి ఓడిన రాప్తాడు నుంచి.. ధర్మవరం నియోజకవర్గానికి షిఫ్టుఅయిన పరిటాల శ్రీరాంపై ఆయనఘాటు విమర్శలు చేశారు.
అంతేకాదు.. ఇప్పటివరకు ఎవరూ అనని రీతిలో..పరిటాల శ్రీరామ్ ను జూనియర్ ఆర్టిస్టుగా అభివర్ణించటం గమనార్హం. అంతేకాదు.. పరిటాల రవి మీదా తీవ్ర ఆరోపణలు చేశారు. తమతో పోల్చుకున్న తోపుదుర్తి.. తమ పూర్వీకులు ఎంతటి గొప్పవారో చెప్పుకునే ప్రయత్నం చేశారు. ‘‘పరిటాల శ్రీరామ్.. జూనియర్ ఆర్టిస్టు బాబూ.. మీ నాన్న బతుకు బీడికట్ట.. హవాయి చెప్పులతో మొదైలంది. మా నాన్న పుట్టుకతో శ్రీమంతుడు. మా పూర్వీకులకు 200 ఎకరాల భూమి ఉండేది. మీలా మేం అవినీతి చేసి దోచుకోలేదు. ప్రజాసేవలో మా డబ్బే ఖర్చు చేశాం. పరిటాల శ్రీరామ్ అనే జూనియర్ ఆర్టిస్టుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు’’ అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేయనని చెబుతూ.. ధర్మవరం నుంచి పోటీ చేస్తానని పరిటాల శ్రీరాం చేసిన వ్యాఖ్యను తోపుదుర్తి తప్పుపట్టారు.
‘‘బాబూ జూనియర్ ఆర్టిస్టు..నీ రాజకీయ ఎత్తుగడలు రాప్తాడులో నా వద్ద చూపు. అంతేకానీ.. ధర్మవరం కేతి రెడ్డి వద్ద చూపిస్తే.. ఆయన నా అంత మంచోడు కాదు. ముందు మీ పార్టీలో మీకు టికెట్ ఇస్తారో.. లేదో.. మీ అధినాయకుడు వద్దకువెళ్లి.. తెలుసుకో. ఆ తర్వాత వచ్చి రాజకీయాలు చేయి’’ అంటూ విరుచుకు పడిన వైనం సంచలనంగా మారింది. అంతేకాదు.. భూస్వాములపై వ్యతిరేకంగా పరిటాల కుటుంబం పోరాడి ఉంటే.. వారికి అన్నిఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో లేక్క చెప్పాలన్నారు.
తాము ఏదో చేశామని చెప్పే పరిటాల శ్రీరామ్.. ఆయన చెప్పే ప్రాంతం అసలు రాప్తాడు పరిధిలోకి రాదన్నారు. పరిటాల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలపై వారం.. వారం ఆధారాలతో మీడియా ముందు ఉంచుతామన్నారు. తమ చివరి రక్తపు బొట్టు ఉన్న వరకు వైసీపీలోనేఉంటామని స్పష్టం చేశారు. తన తండ్రి పరిటాల రవీంద్ర మీద తోపుదుర్తి చేసిన ఘాటు ఆరోపణలకు శ్రీరాం ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.