ఇపుడిదే విషయమై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చాలాకాలం తర్వాత నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గంలో కాలు పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డితో చెడిన దగ్గర నుండి రఘురామ నియోజకవర్గంలో పెద్దగా తిరిగిందే లేదు. ఆ మధ్య ఒకసారి హైదరాబాద్ కు వచ్చిన ఎంపీపై సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విచారణ సందర్భంగా ఎంత గోల జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.
మళ్ళీ అప్పటి నుంచి రాజుగారు అసలు తెలుగు రాష్ట్రాల్లోనే అడుగుపెట్టలేదు. చాలా కాలం తర్వాత తిరుపతిలో జరిగిన అమరావతి జేఏసీ బహిరంగ సభలో సడన్ గా ప్రత్యక్షమై అలాగే మాయమైపోయారు. ఈ నెలలో రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని 13వ తేదీన రఘురామ మళ్ళీ నియోజకవర్గానికి వస్తున్నారు. తన సొంతూరు భీమవరంలోనే రెండు రోజులు ఉంటానని ఎంపీ చెప్పారు. అయితే తన రెండు రోజుల పర్యటన కోసం చాలా జగ్రత్తలే తీసుకుంటున్నారు.
తనపై ఎవరైనా దాడి చేస్తారేమో అని, తనపై ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని అనుమానించినట్లున్నారు. అందుకనే తానుండబోయే రెండు రోజులు పక్కనే ఇద్దరు వ్యక్తులు తన ప్రతి కదలికను వీడియో తీస్తారని చెప్పారు. తనను కలిసేందుకు వచ్చేవారిని కూడా వీడియో తీసేందుకు ప్రత్యేకంగా వీడియో టీమును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంటే తన రాక సందర్భంగా అధికార పార్టీ నేతలు కానీ లేదా ప్రభుత్వం కానీ ఏమన్నా చేస్తుందేమో అనే అనుమానం రాజులో కనబడుతోంది.
మరింత భయం ఉన్న ఎంపీ నియోజకవర్గంలోకి ఎందుకు వస్తున్నారు ? ఎందుకంటే ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారట. ఉప ఎన్నికల్లో జనాలు తనకు ఓటు వేయాలంటే తాను నియోజకవర్గంలో తిరగకపోతే ఎలా ? తనకు పట్టుందని నిరూపించుకోవటానికో లేకపోతే సింపతి సంపాదించుకోవటానికో రాజు నియోజకవర్గంలో పర్యటించక తప్పదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని నామినేషన్ వేసి తనకు ఓట్లేయమంటే ఎవరైనా వేస్తారా ? అందుకనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.