వంగవీటి రెక్కీపై తేల్చేసిన పోలీసులు

వంగవీటి రాధాను చంపేందుకు రెక్కీ నిర్వహించారనే విషయంలో ఆధారాలు లేవు.. ఇది తాజాగా పోలీసులు తేల్చిన విషయం. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా మీడియాతో మాట్లాడుతూ తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యలు చేసిన రాధా అందుకు తగ్గ ఆధారాలను తమకు ఇవ్వలేదని చెప్పారు. వారం రోజుల క్రితం తనను అంతం చేయటానికి రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాధా వ్యాఖ్యలతో విజయవాడలో బాగా రాజకీయ వేడి రాజుకుంది.

రెక్కీ జరిగిందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే ఆ వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలతో రెచ్చిపోయారు. దాంతో మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు ఎదురుదాడికి దిగారు. ఈ విషయాలు ఎలాగున్నా ప్రభుత్వం వెంటనే స్పందించి రాధాకు 2+2 భద్రతను ఏర్పాటు చేసింది. దాన్ని రాధా తిరస్కరించటం మరో వివాదానికి దారితీసింది. ఈ నేపధ్యంలోనే రాధాతో పోలీసు అధికారులు చాలాసార్లు సమావేశమయ్యారు.

రాధా ఇంటి ముందున్న రోడ్డులోని సీసీ ఫుటేజీని చాలాసార్లు పరిశీలించారు. దాదాపు రెండు నెలల సీసీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత రాధాపై రెక్కీ జరిగిందనేందుకు ఆధారాలు లేవని టాటా తేల్చేశారు. ఇదే విషయాన్ని రాధాతో కూడా మాట్లాడినట్లు టాటా చెప్పారు. ఎవరి దగ్గరైనా రెక్కీ జరిగినట్లు ఆధారాలుంటే తమకు అందివ్వాలని అప్పీలు చేయటమే విచిత్రం. పోలీసులకు దొరకని సీసీ ఫుటేజి మామూలు జనాలకు ఎలా దొరుకుతుంది.

నిజంగానే రెక్కీ జరిగుంటే అందుకు ఆధారాలను ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాధాపైనే ఉంటుంది. ఎందుకంటే అనుమానం వచ్చింది రాధాకు, రెక్కీ జరిగిందని తెలుసుకున్నది రాధాయే. కాబట్టి అందుకు ఆధారాలు కూడా రాధాకే తెలిసుండాలి.  రాధా ఇంటి ముందున్న 2 నెలల సీసీ ఫుటేజీలో అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదని పోలీసులే చెబుతున్నారు. మరి రెక్కీ ఎక్కడ జరిగింది ? ఆ విషయాన్ని రాధాయే చెప్పాలి. మొత్తానికి ఇప్పటికైతే రెక్కీ జరగలేదని పోలీసులు తేల్చేశారు. తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం.