కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని.. టీడీపీ యువ నాయకుడు, వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. అయితే.. తనను ఎవరు ఎప్పుడు.. ఇలా ప్రయత్నించారనే విషయంపై ఆయన మౌనంగా ఉండడం గమనార్హం. కొంత మేరకు మాత్రమే ఆయన.. ఈ విషయం వెల్లడించడం.. మిగతాది సస్పెన్స్‌లో పెట్టడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై రాధాను ప్రశ్నించగా.. త్వరలోనే అన్ని విషయాలు బయటికివస్తాయంటూ బదులిచ్చారు. మొత్తంగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
అయితే.. రాధా వ్యాఖ్యలతో ప్రభుత్వం వెంటనే ఆయనకు 2+2 భద్రత కల్పించింది. గన్‌మన్లు కూడా రాధా ఇంటికి పంపారు. అయితే.. వారు వద్దంటూ.. రాధా వారిని తిప్పిపంపారు. ఇదిలావుంటే.. ఇప్పుడు రాధా చేసిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్.. ఇయర్ రౌండప్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా రాధాపై రెక్కీకి సంబంధించిన అంశాలపైనాఆయన రియాక్ట్ అయ్యారు. అయితే.. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. సుమారు 1000 మందిని విచారించామని.. అదేసమయంలో వారం పది రోజుల రాధా ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించామని చెప్పారు.
అయినప్పటికీ.. తమకు ఎలాంటి ఆధారం కూడా లభించలేదన్నారు. అరవ సత్యంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారనే అంశాన్ని ఆయన తొసిపుచ్చారు. అయితే.. గత రెండు మూడు నెలల ఫుటేజీని కూడా తీసుకుని విచారిస్తామన్నారు. అదేసమ యంలో ప్రస్తుతం జైల్లో ఉన్న ఖైదీలపైనా దృష్టి పెట్టామని చెప్పారు. ఇప్పటి వరకు తమకు ఆధారాలు లభించలేదని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. రాధా ఆరోపణల నేపథ్యంలోనే పోలీసుశాఖ దర్యాప్తు చేపట్టిందన్నారు. అయితే.. రాధా పై రెక్కీ నిజం కాదని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అయితే.. ఇప్పుడు రెండు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. రాధా ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఇలా వ్యాఖ్యలు చేశారా? లేక.. నిజమేనా? అనేది ఒక అనుమానం. రెండు.. రెక్కీ అంశంపై విజయవాడ ప్రజల్లో వైసీపీకి చెందిన ఒక యువనేతపై చర్చ జరుగుతోంది. సో.. ఆయన అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి.. రెక్కీ జరిగినా.. పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో పోలీసులు ఏమైనా చేస్తున్నారా? అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఏదేమైనా.. రాధాపై రెక్కీ వివాదం.. ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.