కేసీఆర్ నిర్ణయం స‌రైందే.. కానీ: బండి

తెలంగాణ‌లో అనూహ్య‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్‌పై ఎప్పుడూ నిప్పులు చెరిగే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్‌.. తాజాగా కూల‌య్యారు. అంతేకాదు.. కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణ‌యాన్ని ఆయ‌న స‌మ‌ర్ధించారు. అయితే.. దీనిలో కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని మాత్రం సూచించారు. తాజాగా బండి సంజ‌య్ స‌హా ప‌లువురు నేత‌లు ఇటీవ‌ల ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్‌ను కలిశారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైకు వినతిపత్రం అందించారు.

అనంతరం బండి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం సీఎం కేసీఆర్‌కు లేదని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు దాటినా ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ జీవో 317ను వ్యతిరేకించట్లేదని చెప్పారు. అయితే.. దీనిని కొద్దిగా సవరించాలని కోరుతున్న‌ట్టు తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

జీవో 317ను సవరించాలని గవర్నర్‌ను కోరిన‌ట్టు బండి తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం కూడా లేదా? అని ప్ర‌శ్నించారు. “రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు దాటింది. ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు. సకల జనుల సమ్మె వల్లే తెలంగాణ సాకారమైంది. ఉద్యోగుల వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు“ అని వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సంజయ్ కోరారు. జీవోను సవరించే వరకు బదిలీల ప్రక్రియను ఆపేయాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరాశ చెందొద్దన్న సంజయ్… బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. సీఎం వైఖరిలో మార్పు వచ్చేవరకు ఆందోళన చేస్తామన్నారు. జీవో విషయంలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. మొత్తానికి బండి సంజ‌య్ దూకుడు త‌గ్గించ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది.