దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌ను గద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తేవడం వెనక ఆ ఇద్దరి వ్యూహాలున్నాయి. ఒక్కసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీల గుప్పిట్లో ఉన్న రాష్ట్రాలను ఒక్కొక్కటిగా చేజిక్కించుకోవడంలోనూ ఆ ఇద్దరి పాత్ర కీలకం. ఇప్పుడు తెలంగాణపైనా ఆ ఇద్దరు కన్నేశారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటారు.. ఒకరేమో ప్రధాని నరేంద్ర మోడీ కాగా మరొకరు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈ మోడీషా ద్వయం ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన సంగతి తెలిసిందే.
పాగా వేసేందుకు..
వరుసగా రెండు ఎన్నికల్లోనూ గెలిచి కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ.. ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక వాళ్ల వశమైంది. ఇక ఏపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. అయితే ఇటీవల తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేసేందుకు కేంద్ర పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకే ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమవ్వగా.. తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నేతలందరితోనూ అమిత్ షా భేటీ అయ్యారు.
జోరు మీద..
గతేడాది తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. బీజేపీ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం తర్వాత మరింత దూకుడు పెంచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్‌ను బీజేపీ దెబ్బకొట్టింది. ముఖ్యంగా ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం బీజేపీతో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇదే జోరు కొనసాగించేలా చూసేందుకు మోడీషా ద్వయం రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని భావించిన సీఎం కేసీఆర్.. వరి కొనుగోళ్ల వ్యవహారాన్ని ముందేసుకుని కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు అవసరమైన సూచనలను రాష్ట్ర బీజేపీ నేతలకు మోడీషా ద్వయం చేసినట్లు సమాచారం.
ఫలించేనా..
రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిని వెలుగులోకి తీసుకు రావాలని.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని తాజాగా అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నేతలకు మార్గనిర్దేశనం చేశారు. బండి సంజయ్ పాదయాత్రకు జనాల్లో ఆదరణ వస్తుందని చెప్పిన ఆయన.. రెండో విడత పాదయాత్రకు వస్తానని మాటిచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందుకే రాష్ట్ర నేతలకు పాఠాలు చెబుతూ ఆ దిశగా సన్నద్ధం చేస్తోంది. మరోవైపు తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజమే. కానీ ఆ వ్యతిరేకత బీజేపీకి అధికారాన్ని తెచ్చే స్థాయిలో ఉందా? అంటే లేదనే సమాధానాలే వినిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోపు బీజేపీ తన స్థాయిని ఎలా పెంచుకుంటుందో? మోడీషా పాఠాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో? వేచి చూడాల్సిందే.