వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగుళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఆ తర్వాత కూడా 4 గంటలపాటు విమానం డోర్లు తెరవకుండా ప్రయాణికులందరినీ విమానంలో ఉంచారు. ఈ విషయంపై విమానంలో ఉన్న రోజా ఓ మీడియా చానెల్ తో మాట్లాడారు. ఇండిగో విమాన యాజమాన్య తీరుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరులో ల్యాండ్ చేశారని తెలిపారు.
విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదని, 4 గంటలపాటు తనతో సహా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారని అన్నారు. మబ్బులుండడం వల్ల తిరుపతిలో కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని చెప్పారు.
కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తమకు తెలిసిందన్నారు. అయితే, తలుపులు తీస్తే బయటకు వెళ్లిపోతామని ప్రయాణికులు చెప్పినా సిబ్బంది వినలేదని, అధికారుల నుంచి తమకు ఆదేశాలు రాలేదని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, అదనంగా టికెట్‌కు రూ. 5వేలు అడిగారని, ఇండిగోపైన కేసు వేస్తానని రోజా అన్నారు.