ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్లు చేశారు. ఏపీ దివాలా తీస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తోందని నిప్పులు చెరిగారు. విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జీవీఎల్.. ఈ సందర్భంగా ఏపీలోని జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. సీఎం జగన్ తన మెచ్చుకోలు పథకాలతో రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నారని అన్నారు.
కేంద్ర పథకాలు తమవిగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదని.. కొన్ని కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. మరికొన్ని కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వడం లేదని అన్నారు. భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. గతంలో పెనంపై ఉన్న రాష్ట్రం ఇప్పుడు జగన్ నిర్వాకం కారణంగా.. పొయ్యిలో పడిపోయిందని అన్నారు.
చేసిన అప్పులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా.. ఓటు బ్యాంకు, రాజకీయ అవసరాలకోసం మాత్రమే ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందన్నారు. రాష్ట్ర రాజకీయం, ఆర్థిక పరిస్థితులపై కోర్‌కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు జీవీఎల్ తెలిపారు.
“రెండున్నర ఏళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తున్నారు. కేంద్ర పథకాలకు ఇక్కడి పేర్లు పెట్టుకుంటున్నారు. కొన్ని కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలుకావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం” అని జీవీఎల్ వ్యాఖ్యానించడం గమనార్హం.