మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కౌన్సిలర్, టీఆర్ఎస్ నేత మల్లాది వాసు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొడాలి నాని, వంశీలను చంపితే 50 లక్షల రూపాయల నజరానా ఇస్తానని వాసు చేసిన ప్రకటన పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు.
కొడాలి నానిని, తనను కమ్మ సామాజిక వర్గం నుంచి వెలివేయాలనుకుంటున్నారని వంశీ ఆరోపించారు. అరికెపూడి గాంధీవంటి వారంతా ఆస్తులు పెంచుకోవడానికే పార్టీలు మారారని ఆరోపించారు. కుట్రలు పన్నడం చంద్రబాబు స్వభావమని, చంద్రబాబే కమ్మ సామాజిక వర్గానికి పట్టిన అతిపెద్ద చీడపురుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఉండగా ఈ కులం బాగుపడదని షాకింగ్ కామెంట్లు చేశారు.
అయితే, ఈ కులానికి చంద్రబాబో, తానో, కొడాలి నానినో మొదలు కాదు.. చివర కాదని అన్నారు. అన్నగారు నందమూరి తారకరామారావు గారు టీడీపీని కమ్మ కులస్తుల కోసం పెట్టలేదని, అణగారిన, బడుగు, బలహీన, పేద వర్గాల కోసం పెట్టారని గుర్తు చేశారు. టీడీపీని కులపార్టీగా మార్చింది చంద్రబాబేనని, పార్టీ కార్యకర్తల్లో,నేతల్లో కులబీజాలు నాటింది ఆయనేనని వంశీ ఆరోపించారు.
15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, చాలామంది బలమైన ప్రత్యర్థులతో పోరాడి ఈ స్థాయికి వచ్చానని వంశీ అన్నారు. తాజాగా వచ్చిన బెదిరింపులపై స్పందిస్తూ… వీళ్ల తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు, పిచ్చి వాగుళ్లకు కొడాలి నాని, వంశీలు భయపడరిన చెప్పారు. దేనికైనా రెడీ అని, దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధమని తెగేసి చెప్పారు. ఎవడేం చేస్తాడో చూద్దాం.. ఎవడేం చేయగలడో తేలుతుంది కదా అని ఆ నజరానా వ్యాఖ్యలపై వంశీ సవాల్ విసిరారు. వంశీ వ్యాఖ్యలు ఈ రేంజ్ లో ఉంటే…ఇక కొడాలి నాని మరింత ఘాటుగా స్పందిస్తారేమో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates