ఏపీ రాజధాని అమరావతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులు చేశారు. ఇక ఈ రోజు మూడు రాజధానులను రద్దు చేస్తూ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు అమరావతి రాజధానిగా 2014 – 2021 సంవత్సరాల మధ్య ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
- 2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతి రాజధాని అని నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది.
- 2014 డిశంబర్ 31 సీఆర్డీయే చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
- అమరావతిలో మొత్తం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ప్రాంతంగా గుర్తించారు.
- రాజధాని కోసం 54 వేల ఎకరాల ప్రభుత్వ, రైతుల భూముల సమీకరించాలని అనుకున్నారు.
- మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాల్లో సీఆర్డీయే పరిధి విస్తరించి ఉంది.
- 2015 అక్టోబర్ 22వ తేదీ ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
- నాలుగేళ్ల కాలంలో రు. 7200 కోట్లతో నిర్మాణాలు, రోడ్లు గత ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డాయి.
- 2019 డిశంబర్ 17వ తేదీన మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.
- మంత్రులు కమిటీ, బోస్టన్ కమిటీ. జిఎన్ రావు కమిటీ నివేదికల ఆధారంగా రాజధానిని వికేంద్రకరిస్తూ జగన్ ప్రభుత్వం కొత్త చట్టం చేసింది.
- 2020 జనవరిలో సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రకరణ పేరిట మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది.
- ప్రభుత్వ బిల్లును శాసన మండలిలో ప్రతిపక్షం అడ్డుకుంది. ఇక్కడ బిల్లు ఆమోదం పొందలేదు.
- మండలి పరిణామాలపై ఆగ్రహంతో జగన్ ఏకంగా మండలినే రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
- ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, రాజకీయ పక్షాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
- రెండేళ్లుగా రాజధానిపై కోర్టులో విచారణ సాగుతూనే ఉంది. ప్రభుత్వం చట్టాలపై గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది.
- ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు.
- సడెన్ ట్విస్టుగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును క్యాన్సిల్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది.
మరి ఏపీ రాజధాని విషయంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ? కాలమే చెపుతుంది.