దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. తరాలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. రైతుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. వాళ్ల కష్టాలు.. ఇబ్బందులు.. సమస్యలు అలాగే ఉన్నాయి. పంట పండించేందుకు శ్రమించే రైతులు.. దాన్ని అమ్ముకునేందుకు అంతుకుమించి కష్టపడే పరిస్థితులు దాపురించాయి. దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా.. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నా.. అన్నదాతల దుస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఓట్ల కోసం ఏమైనా చేసే నాయకులు.. ఇప్పుడు రాజకీయ ఆటలో రైతులను బలి పెట్టడం శోచనీయం. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఉన్న ప్రభుత్వాలది అదే పద్ధతి. దీంతో చివరకు రైతులు బతుకులే ఆగమవుతున్నాయి.
తెలంగాణలో ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ముఖ్యంగా వరి దిగుబడి ఇమ్మడిముమ్మడిగా పెరిగింది. దీంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. కానీ పండిన పంటను అమ్ముకోవడంలో జరుగుతున్న జాప్యంతో ఇప్పుడు అవే కళ్లలో కన్నీళ్లు కారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని తెగేసి చెప్పింది. వర్షకాలం పంటలు ఇప్పటికే చేతికి వచ్చాయి కాబట్టి ఈ సారి వరి కొనుగోళ్లు చేస్తామని.. కానీ యాసంగి వడ్లను కొనమని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రంతో పోరాడతామని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు వారాల తరబడి ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడి పండిన పంట కళ్లముందే మొలకలెత్తి పనికి రాకుండా పోతుంటే బాధతో ప్రాణాలు విడుస్తున్నారు. కామారెడ్డి మండంలో వడ్ల కుప్పపైనే రైతు ప్రాణాలు వదలడమే అందుకు నిదర్శనం. ఇంతకుమించి బాధాకరం మరొకటి ఉండదు.
పరిస్థితి ఇలా దారుణంగా మారుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. అంతే కాకుండా తప్పంతా కేంద్రానిదే అని విమర్శలు చేస్తోంది. ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి వడ్ల కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ విషయాన్ని వదిలేసి కేంద్రం ఆదేశాల మేరకు యాసంగిలో వరి వేయొద్దని చెబుతోంది. అంతే కానీ వరికి ప్రత్యామ్నాయంగా వేసే పంటలు వాటికి అవసరమైన మందులు ఎరువుల వివరాలు మాత్రం బయట పెట్టడం లేదు. వరి వేస్తే మాత్రం కొనమని చెప్తుందే తప్పా.. మరి ఏ పంటలు వేయాలనే అవగాహన మాత్రం కల్పించడం లేదు.
ఏడాదికి పైగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు పట్టించుకోవడం లేని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఉప్పుడు బియ్యం కొనమనే ఆదేశాలతో వరి రైతుల బతుకులను ఆగం చేస్తోంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత ఉంది. కానీ అవేమీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం అన్నదాతలతో ఆడుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వరి పండించాలని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొనదో చూస్తామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో మాత్రం అదే పార్టీ ఉప్పుడు బియ్యం కొనేది లేదని అంటోంది. రాష్ట్ర ప్రభుత్వమేమో వరి వేయొద్దొని చెబుతోంది. మరోవైపు కాంగ్రేసేమో.. కేసీఆర్, మోడీ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని అంటోంది. మొత్తానికి తమ ప్రయోజనాలను కాపాడుకునే రాజకీయ పార్టీల చేతుల్లో రైతులు బలి అవుతున్నారనేది చెదు నిజం.
This post was last modified on November 8, 2021 2:53 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…