మనదేశంలోని రాజకీయ నాయకుల్లో చాలామంది పలురకాల కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా, మరికొందరు ఆర్థికపరమైన, అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. పరిమిత సంఖ్యలో కోర్టులుండడం…అపరిమిత సంఖ్యలో కేసులున్నాయి. దీంతో, పొలిటిషియన్లపై ఉన్న కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో, సదరు రాజకీయ నాయకులపై విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటోంది.
ఆ విచారణ పెండింగ్ లో ఉండగానే చాలా మంది నేతలు…ఒకటికి రెండుసార్లు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి సీఎంలుగా కొనసాగుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలని కింది కోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణను రోజువారీ జరపాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది.
నేటి నుంచి జగన్ తోపాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నవారి కేసుల విచారణను రోజువారీ జరగనుంది. ఆ కేసుల్లో దాఖలైన రిట్ పిటిషన్లపై రోజూ విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. గతంలో సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు కోరారు. ఆ పిటిషన్ తో పాటు 2012 నుంచి దాఖలైన 40 వ్యాజ్యాలు హైకోర్టు విచారణ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, ఈ విచారణ మొదలుబెట్టేందుకు వారం రోజుల గడువు కావాలనిజగన్ తరఫు న్యాయవాదులు కోరారు.
అయితే, సుప్రీం ఆదేశానుసారం ప్రతి రోజు విచారణ జరుపుతామని, అందుకు సిద్ధంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. హెటిరో, అరబిందో కేసులతో విచారణ మొదలు పెడతామని వెల్లడించింది. అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా లిమిటెడ్‌లకు భూకేటాయింపుల్లో అవకతకవకలు, క్విడ్ ప్రోకో కేసులపై తొలుత విచారణ జరగనుంది. మరోవైపు, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.