ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా అన్న మాట తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. వారు టార్గెట్ చేసిన వారు ఎవరైనా సరే.. వారు కోరుకున్న ఇమేజ్ ను తీసుకురావటంలో అదే పనిగా విజయవంతం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. దూకుడుగా వెళ్లటం.. కింద పడినా పైచేయి తమదేనని బలంగా వాదించటం లాంటివి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాంటివి తమలో లేకపోవటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ మాజీ మంత్రి నారా లోకేశ్ లోపంగా భావిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. కొత్త తరహా ఇమేజ్ కోసం లోకేశ్ తహతహలాడుతున్న వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
తనను ‘పప్పు’ పేరుతో డ్యామేజ్ చేసిన వేళ.. తనలోని ఫైర్ బ్రాండ్ ను ప్రదర్శించుకోవాలన్నట్లుగా లోకేశ్ ప్రెస్ మీట్ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కొత్త తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. తనను తాను సరికొత్తగా ప్రజంట్ చేసుకోవటంతో పాటు.. తన తండ్రి మాదిరి తాను సాఫ్ట్ గా ఉండనన్న సందేశాన్నిపార్టీ క్యాడర్ కు ఇవ్వటానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్ ను చూసినప్పుడు లోకేశ్ కొన్ని సందర్భాల్లో ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. తాను మారుతున్నానని.. ఇప్పటికే మారినట్లుగా స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. ప్రెస్ మీట్ లో లోకేశ్ నోటి నుంచి ఈ తరహాలో వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే..
- తెలుగుదేశం పార్టీ దేవాలయంపైనే దాడికి తెగబడిన సైకోరెడ్డి ఫ్యాన్స్ దేశంలో ఎక్కడ దాక్కున్నా తెలుగుదేశం వదలదు. సైకో రెడ్డి నువ్వు చంద్రబాబుని రాళ్లతో కొట్టి చంపాలని కూసిన కూతలు మరిచిపోయావా? చంద్రబాబుకి ఒక చెంపపై కొడితే మరో చెంప చూపుతారు.. నేను మీ రెండు చెంపలు పగలగొడతాను.
- మా నాయకులు గట్టిగా నిలదీస్తే.. పిరికోడిలా ఎవరూ లేని సమయంలో మీరు మీ కుక్కల్ని పంపించారు. తర్వాత పారిపోయారు. దాడితో టీడీపీ భయపడుతుంది అనుకుంటే పొరపాటు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని హెచ్చరిస్తున్నా. నీ కోడికత్తి వేషాలు నా దగ్గర చూపించకు.
- నేను మా నాన్నలా సాఫ్ట్ కాదు. మా నాన్న గారు ఒక చెంప పై కొడితే ఇంకో చెంప చూపిస్తారు. నన్ను కొట్టిన వాడి రెండు చెంపలు వాచిపోయేలా కొట్టే రకం నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.. అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. కొట్టిన ప్రతి దెబ్బకి బదులు ఇస్తాం. ఒకటికి పది. దాడి చేసున్న వాళ్ళు ఎవరో తెలుసు. దాడి వెనుక ఉన్న సూత్రదారులు ఎవరో తెలుసు. బీ కేర్ ఫుల్.
- అధికారం మారితే సరెండర్ అవుతాం అనుకుంటున్నారో ఏమో. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవిస్తారు. శిక్ష కూడా మీరు ఊహించని రేంజ్ లో ఉంటుంది.
- వైకాపా నేతలు మాట్లాడిన భాష, జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తులేవా? చంద్రబాబు కాలర్ పట్టుకోవాలి, నడివీధిలో కాల్చిచంపాలని మీరు చెప్పారా లేదా? బంగాళాఖాతంలో కలపాలని, ముఖ్యకంత్రీ అని, దున్న అని, జైల్లో పెట్టి తన్నాలని మీరు అన్నారా లేదా? అని సైకో రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా.
- జగన్ రెడ్డిని అంటే ఆయన అభిమానులకు బీపీ వచ్చిందని చెబుతున్నారు. చంద్రబాబు గారిని అంటే ఆంధ్ర రాష్ట్రానికే బీపీ వస్తుంది. మా పార్ట కార్యకర్తలను వదిలితే మీ వీపులు పగులుతాయని హెచ్చరిస్తున్నా.
- పోస్టింగ్ ల కోసం గౌతమ్ సవాంగ్ చంద్రబాబు గారికి పదేపదే ఫోన్ చేయలేదా గతంలో? ఇప్పుడు కేంద్ర హోం మంత్రి, గవర్నర్ స్పందించినా డీజీపీ స్పందించలేదు. ఇప్పుడన్నా డీజీపీ చట్టాలు అమలు చేయాలి. పోలీసులకు ఒక్కటే చెబుతున్నా దిగజారి వ్యవహరించకండి. అధికారం శాశ్వతం కాదు. మీరు చేస్తున్న తప్పులు అన్ని మీతోనే సరిచేయిస్తా.
- తెలుగుదేశం సహనాన్ని చేతకానితనం అనుకుంటున్నావా జగన్ రెడ్డి? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్టడానికి మాకు ఒక్క నిమిషం చాలు.