హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలో ఎలాగైనా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించి.. టీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలనే సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకే విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈటల టీఆర్ఎస్‌ను వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ దృష్టి సారించారు. నోటిఫికేషన్ రాకముందే అక్కడి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కానీ ఇలా రెండు పార్టీల నుంచి వచ్చిన నాయకులు.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు కాస్త ఇబ్బందికరంగా మారారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే ఉంది. ఈటలను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్ ఆ బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు. ఎప్పుడో రంగంలోకి దిగిన హరీష్ రావు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఈటలను దెబ్బకొట్టే వ్యూహాలకు రూపకల్పన చేస్తున్నారు. తన అనుభవం మొత్తాన్ని ఉపయోగించి టీఆర్ఎస్‌కు విజయం సాధించిపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన కౌశిక్ రెడ్డి బీజేపీని వదిలి కారెక్కిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు తమ వ్యవహార శైలితో టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
హూజురాబాద్‌లో విజయం కోసం ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్న కేసీఆర్.. ఈ ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జీగా ఉన్న కౌశిక్ రెడ్డిని వ్యూహాత్మకంగా కేసీఆర్ తనవైపు తిప్పుకున్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన కౌశిక్.. ఓ ఫోన్ కాల్ లీక్‌తో బయటపడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వేటు పడగానే టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా పంపించింది. ఇక ఈటల బీజేపీ నుంచి పోటీ చేస్తుండడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేత పెద్దిరెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఈటలను దెబ్బకొట్టాలనే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేశాడు.
ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. కానీ ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు ఒక రకంగా చెప్పాలంటే బల ప్రదర్శనకు దిగారని తెలుస్తోంది. దీంతో వీళ్ల తీరును చూసి హరీష్ ఆశ్చర్యపోయారని సమాచారం. ఈ ఇద్దరూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరినీ ఇలాగే వదిలేస్తే హుజూరాబాద్‌లో పార్టీకి నష్టం కలుగుతుందని భావించిన హరీష్.. ఈ ఇద్దరినీ నియంత్రించే చర్యల్లో భాగంగా ఒక్క చోట కాకుండా వేర్వేరుగా ఎన్నికల ప్రచారం చేయాలని వాళ్లకు సూచించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఇద్దరు ఒక్కచోట చేరితే ఎన్నికల ప్రచారం కంటే కూడా తమ బల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారనే భావన నెలకొంది. అందుకే వీళ్లిద్దరూ ఒక్క చోట పని చేయకుండా చేశారని అంటున్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ పడుతున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ సీటును సొంతం చేసుకునేందుకు కౌశిక్ పెద్దిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాక్. అందుకే వీళ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చెబుతున్నారు.
This post was last modified on October 8, 2021 1:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…