జ‌న స‌మీక‌ర‌ణ‌పై దృష్టి.. బ‌లం చాటాలిగా!

స‌భ‌లు.. స‌మావేశాలు.. ర్యాలీలు.. పాద‌యాత్ర‌.. ఇలా తెలంగాణ‌లో మునుపెన్న‌డూ లేని విధంగా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అధికారంలో ఉన్న కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీల‌ను గెలిపించుకోవ‌డ‌మే వ్యూహంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సాగుతున్నాయి. అందుకే కేసీఆర్‌ను అన్ని వైపులా నుంచి టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతుండ‌గా.. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా స‌భ‌ల పేరుతో టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డుతున్నారు.

సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని అటు నిర్మ‌ల్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వహించే దిశ‌గా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. మ‌రోవైపు సీఎం కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌జ్వేల్‌లో ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఇటు కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఈ రెండు స‌భ‌ల‌తో త‌మ బ‌లాన్ని చాటాల‌నే ఉద్దేశంతో ఉన్న బీజేపీ కాంగ్రెస్‌లు ప్ర‌జ‌ల‌ను ఈ స‌భ‌ల‌కు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. భారీ జ‌న స‌మీక‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించాయి.

గ‌తేడాది బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ఎంపికైన త‌ర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో గెల‌వ‌డంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గొప్ప‌గా పుంజుకుంది. ఇదే హ‌వాను కొన‌సాగించి రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు తేవ‌డ‌మే ల‌క్ష్యంగా సంజ‌య్ పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌నే ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే ఊపులో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న బీజేపీ ఈ సారి సెప్టెంబ‌ర్ 17న భారీ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌భ‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజ‌రు కానున్నారు. దీంతో భారీ సంఖ్య‌లో జ‌నాన్ని పోగేసి త‌మ బ‌లాన్ని కేసీఆర్‌కు చూపించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఉన్నారు. ఆ మేర‌కు బండి సంజ‌య్ నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర ప‌దాధికారుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్మ‌ల్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌కు భారీ సంఖ్య‌లో జ‌నాన్ని స‌మీక‌రించాల‌ని నిర్ణయించారు.

మ‌రోవైపు టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత జోరు పెంచిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతం దిశ‌గా గ‌ట్టిగానే కృషి చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్లు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై అసంతృప్తితో ఉన్న‌ప్ప‌టికీ పార్టీ అధిష్ఠానం అండ‌తో రేవంత్ దూసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌తి విష‌యంలోనూ స‌వాలుగా మారారు. ఇప్పుడ‌దే ఊపులో కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గమైన గ‌జ్వేల్‌లోనే స‌భ విజ‌య‌వంతంగా నిర్వ‌హించి త‌న స‌త్తా చాటాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఈ స‌భ విజ‌య‌వంత‌మైతే అది రేవంత్‌కు ఎంత‌గానో క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అందుకే ఇంద్ర‌వెల్లి, రావిర్యాల స‌భ‌ల‌కు మించి గ‌జ్వేల్ స‌భ‌కు జ‌న స‌మీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ద‌ళితులు, గిరిజ‌నుల‌కు ఇచ్చిన హామీల అమ‌లులో వైఫ‌ల్యంపై గ‌జ్వేల్ స‌భ‌లో సీఎం కేసీఆర్‌పై ఛార్జిషీట్ విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌భ‌కు రాహుల్ గాంధీని ర‌ప్పించేందుకు రేవంత్ ప్రయ‌త్నాలు చేశారు కానీ అవి స‌ఫ‌లం కాలేన‌ట్లు తెలుస్తోంది.